గులాబీపై కమలం దూకుడు!
► అధికార టీఆర్‌ఎస్‌పై పోరు తీవ్రం చేయనున్న బీజేపీ
► చలో అసెంబ్లీ విజయవంతంతో ఉత్సాహంతో పార్టీ శ్రేణులు
► యూపీలో గెలుపుతో ఊపుమీదున్న జాతీయ నాయకత్వం
► తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక దృష్టి..
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయా లను ఎండగడుతూ నిరసనలు, ఆందోళ నలను తీవ్రం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. అడుగడుగునా ప్రభుత్వ నిర్బంధం, తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిర్వహిం చిన చలో అసెంబ్లీ విజయవంతం చేశామనే అభిప్రాయంతో పార్టీ నాయకులున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుని, కేబినెట్‌లో ఆమోదించేందుకు సిద్ధమై చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడాన్ని బీజేపీ ముఖ్య నేతలు తమ విజయంగానే భావిస్తు న్నారు.
ఈ నేపథ్యంలో ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం అందివచ్చిన ఆయుధంగా భావించి, దాన్ని వీలైనంతగా ఉపయోగిం చుకునేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. మిషన్–2019 పేరిట రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజల్లో నమ్మకం కలిగించేలా కార్యాచరణను చేపట్టనుంది. ముస్లిం రిజర్వేషన్ల పెంపు యోచనను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విరమించుకునే దాకా మండల స్థాయి వరకు నిరసనలను తీవ్రం చేయాలని ముఖ్య నేతలు నిర్ణయించారు.
గత వైఖరికి భిన్నంగా..
గతంలో అనుసరించిన వైఖరికి భిన్నంగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సమస్యలపై దూకుడుగా వ్యవహరించి అధికారపక్షాన్ని ఇరుకునపెట్టేలా బీజేపీ వ్యవహరిస్తోంది. దీనికి కొనసాగింపుగా తొలిసారిగా పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి రెండురోజుల సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ముస్లిం రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా జిల్లా, మండల స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించి చివరగా అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొన్నివేల మంది బీజేపీ నాయకులు అరెస్ట్ అయ్యారు.
ఏప్రిల్‌లో అమిత్ షా పర్యటన
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అఖండ విజయం, అంతకుముందు వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో జాతీయ స్థాయిలో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అంతగా ఎంపీ సీట్లు గెలుచుకోని తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లపై పట్టు సాధించాలని ఆయా రాష్ట్ర శాఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశించారు. కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలలో అధికారంలో వచ్చేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
ఏప్రిల్‌లో అమిత్‌షా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పూర్తిస్థాయిలో బేరీజు వేయనున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం తదితర అంశాలను కూలంకశంగా పరిశీలిస్తారు. పార్టీ సంస్థాగత లోటుపాట్లు, లోపాలను సరిదిద్దేందుకు తనదైన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సమాచారం.