ఏపీపై కేంద్ర మంత్రికి కేసీఆర్ ఫిర్యాదు
హైదరాబాద్: విభజన చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కి ఆయన ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్... సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ ప్రభుత్వంతో నెలకొన్న పలు అంశాల ప్రతిష్టంభనను రవి శంకర ప్రసాద్కు వివరించారు.
రాజధాని నగరంలో ఐటీఐఆర్ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాలని రవి శంకర ప్రసాద్కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి, ఎగుమతులు, ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ భేటీలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.