సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. మూడ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన సీఎం శుక్రవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుత జోనల్ విధానం వల్ల ఉద్యోగాల్లో స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించలేకపోతున్నామని, అందుకే కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని కేంద్రమంత్రికి వివరించారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు 95 శాతం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కలుగుతుందన్నారు. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ తన ప్రక్రియను వేగవంతం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని కోరారు.
సత్వరమే హైకోర్టును విభజించండి
హైకోర్టు విభజనకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌ను కేసీఆర్ కోరినట్టు తెలిసింది. ఏపీ హైకోర్టును ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో కేంద్రానికి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే హైకోర్టు విభజనపై తమ ప్రక్రియ పూర్తయిందని, ఏపీ ప్రభుత్వమేనూతన హైకోర్టు నిర్మించి వర్తమానం పంపాల్సి ఉందని కేంద్రమంత్రి సీఎంతో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వమే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి హైకోర్టు విభజనలో వేగం పెంచేలా చూడాలని సీఎం కోరారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ వర్గాలకు రిజర్వేషన్ల పెంపుపై చేసిన తీర్మానాలు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాన్ని సీఎం కేసీఆర్.. రవిశంకర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు.
అసెంబ్లీ సీట్ల పెంపుపై చర్చ
అసెంబ్లీ సీట్ల పెంపుపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. అంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపునకు అవసరమైన చట్ట సవరణ ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోందని కేంద్ర హోంశాఖ ఇటీవల ఎంపీ వినోద్ కుమార్‌కు ప్రత్యుత్తరం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్–170ని సవరించనంత వరకు సీట్ల పెంపు కుదరదని, అయితే విభజన చట్టంలోని సెక్షన్–26ను అమలు చేసేందుకు వీలుగా 170(3)ని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రెండో షెడ్యూల్‌ను సవరించేందుకు అవసరమైన ముసాయిదా కేబినెట్ నోట్ తయారు చేసి న్యాయశాఖకు పంపామని కేంద్ర హోం శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం చట్ట సవరణపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది? అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పట్లోగా పూర్తి కావొచ్చు? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కూడా సమావేశానికి పిలిపించిన రవిశంకర్ ప్రసాద్ సీట్ల పెంపునకు అవసరమైన చట్ట సవరణపై ప్రస్తుత పరిస్థితిని కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. కేంద్రమంత్రిని కలసిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రధానితో సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదం, హైకోర్టు విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణానికి అవసరమైన రక్షణ శాఖ భూమి బదలాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన రాజ్యాంగ సవరణ, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment