మరో కోనసీమగా ఉత్తర తెలంగాణ
♦ గోదావరి జలాలతో ఐదు జిల్లాలు సస్యశ్యామలం
♦ రైతు దుఃఖానికి గోదావరి జలాలే పరిష్కారం
♦ అందుకే ‘మహా’ ఒప్పందం
♦ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్/జగదేవ్‌పూర్/గజ్వేల్:తెలంగాణ రైతుల దుఃఖానికి, ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం గోదావరి జలాలతోనే సాధ్యమవుతుందని అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భవిష్యత్‌లో ఉత్తర తెలంగాణ జిల్లాలు మరో కోనసీమగా మారనున్నాయని చెప్పారు. బుధవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో 61 మంది రైతు కుటుంబాలతో కలసి సహ పంక్తి భోజనం చేశారు.
బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున రూ.2.73 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, సీఎం దత్తత గ్రామమైన జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కుంటల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, అన్నదాతలు ఆధైర్యపడవద్దని, భవిష్యత్తులో గోదావరి జలాలు రానున్నాయని, మంచిరోజులు వస్తాయని మంత్రి భరోసా కల్పించారు. జిల్లాలో ఆరు లక్షల ఎకరాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని, హల్దీ ప్రాజెక్ ద్వారా నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్‌ను నింపుతామన్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిని సస్యశ్యామలం చేస్తామన్నారు.
ఆరు దశాబ్దాల కల సాకారం
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కల మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో సాకారమైందని మంత్రి పేర్కొన్నారు. 2013లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ల మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ప్రాజెక్టు ఎత్తు అంశాలపై కిరణ్ కుమార్‌రెడ్డి అస్పష్టతతో కూడిన లేఖను రాసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు.
ప్రజలకు గోల్డెన్ డే
‘తెలంగాణ సస్యశ్యామలం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రతో నీళ్ల ఒప్పందం చేసుకుంటే కాంగ్రెసోళ్లు బ్లాక్‌డే అంటూ ప్రచారం చేస్తుండ్రు.. కానీ ఆ ఒప్పందం కాంగ్రెసోళ్లకే బ్లాక్ డే.. తెలంగాణ ప్రజలకు గోల్డెన్ డే’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతటి కరువు కాటకాల్లో 1,450 టీఎంసీల నీటిని మన ప్రాజెక్టులకు మలుపుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కేంద్రమంత్రులు ఉమాభారతి, గోయల్ తెలంగాణను చూసి నేర్చుకోవాలని హితవు పలికారన్నారు.
మైనార్టీలకు 80శాతం సబ్సిడీపై రుణాలు
మైనార్టీల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసిన తమ ప్రభుత్వం ఈసారి మరిన్ని నిధులు పెంచడానికి కృషి చేస్తోన్నట్టు మంత్రి హరీశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా మైనార్టీలకు రూ.3 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రకటిస్తే.. కేవలం తెలంగాణలోని మైనార్టీల కోసం సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ప్రకటించారని చెప్పారు. ఇది మైనార్టీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుందన్నారు.