విపక్షాల విమర్శలు అర్థరహితం: గుత్తా
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈర్ష్యకు మారుపేరుగా ప్రతి పక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను మెచ్చుకోకున్నా పర్వాలేదు గాని.. అనవసరంగా నోరుపారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసి ఎలాంటి కార్యక్రమాలు చేయని వాళ్లు ఇప్పుడిలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారని స్పష్టం చేశారు.
వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిస్తే.. ప్రతిపక్షాలు బోగస్ సర్వేలని ఆరోపించడం అవివేకమన్నారు. ఏపీ సర్కారు దొంగతనంగా పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటిని తరలించుకుపోతుంటే నోరుమెదపని విపక్షాలు.. సొంత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌కు, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా విశేష కృషి చేస్తున్న కేటీఆర్‌కు, ప్రాజె క్టుల విషయంలో సీఎం ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు ఎంపీ పేర్కొన్నారు