సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖ పదోన్నతుల్లో తమకు న్యాయం చేయాలని ఆరో జోన్ ఇంజనీర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీనియార్టీ జాబితా సిద్ధం చేసినందుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ జలసౌధ కార్యాలయంలో సోమవారం రోజంతా మౌనదీక్షకు కూర్చున్నారు. సుమారు 300 మంది రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌కు చెందిన ఇంజనీర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. జోన్–6 ఉద్యోగులపై వివక్ష తగదని, తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్, జనరల్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.చక్రధర్ మీడియాతో మాట్లాడారు.
ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్‌లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉంటే, జోన–6లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని చెప్పారు. ఈ అన్యాయాన్ని సవరించాలని ఆందోళనలు చేయగా, ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది ఏప్రిల్ 19న ఓ సర్క్యులర్ జారీ చేసిందని అన్నారు. అయితే, ప్రస్తుతం ఆ సర్క్యులర్‌ను, అంతకుముందు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను పక్కనపెట్టి అడ్మినిస్ట్రేషన్ ఈఎన్‌సీ సీనియార్టీ జాబితా తయారు చేశారని అన్నారు. 2014 జూన్2కు ముందు ఉమ్మడి ఏపీలో ఉన్న సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉన్నా, 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ సీనియార్టీ జబితా తయారు చేశారని, దీంతో తమకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం శాఖలో ముగ్గురు ఈఎన్‌సీలు, 23 మంది సీఈలంతా జోన్–5కి చెందిన వారేనని, 45 ఎస్‌ఈ పోస్టుల్లో 28 మంది జోన్–5 ఇంజనీర్లే ఉన్నారని అన్నారు. దీక్షలో డీసీఈలు చంద్రశేఖర్, నరహరి, మురళి తదితరులు పాల్గొన్నారు. కాగా ఇంజనీర్ల దీక్షకు కొద్ది నిమిషాల జలసౌధకు వచ్చిన మంత్రి, అక్కడి టెంట్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి ఖమ్మం పర్యటనకు వెళ్లడం గమనార్హం.
సంకటంలో ప్రభుత్వం..
పదోన్నతులపై జోన్ –6 ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం ప్రభుత్వాన్ని సంకటంలోకి నెడుతోంది. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ , ఆర్‌అండ్‌బీ, పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నత పదవుల్లో జోన్– 6 ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ఒక్క ఇరిగేషన్ శాఖను సాకుగా చూపి, పదోన్నతుల జాబితాను మారిస్తే ఇతర శాఖల్లో జోన్–5 ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని అక్కడ సైతం సవరిస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ సంక్లిష్టాల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ పదోన్నతుల జాబితాను సుప్రీంకోర్టుకు అందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వచ్చే నెల నుంచి జీతభత్యాలకు దూరం అయ్యే అవకాశం ఉంది.
Published Tue, Oct 3 2017 1:15 AM | Last Updated on Tue, Oct 3 2017 1:15 AM
Advertisement
Advertisement