'టీడీపీ అధికారంలోకా.. అతిపెద్ద జోక్'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమంటే ఈ మిలీనియంలోనే అతిపెద్ద జోక్ అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది తమ పార్టీయేనని, తాము అధికారంలోకి రాగానే చంద్రబాబు అక్రమాలన్నింటి మీదా విచారణ చేయిస్తామని, ఈసారి స్టే తెచ్చుకోవడం కూడా చంద్రబాబుకు సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ తెలంగాణకే దక్కాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ డిజైన్పై తమ కొట్లాట కొత్తది కాదన్నారు. తెలంగాణకు న్యాయం చేయమంటే రెచ్చగొట్టినట్లా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడికే వెళ్లాలని తాము ప్రధానమంత్రిని కోరామని, తెలంగాణ పునర్ నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ అడిగామని, అయితే తమ సమస్యలపై కేంద్రం ఒక్కదానికీ స్పందించలేదన్నారు. పోలవరంపై అవసరం అయితే సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు.
కేసీఆర్ పనిలో పనిగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పొన్నాల ఏనాడైనా పాల్గొన్నారా అని ఆయన అడిగారు. పొన్నాల చరిత్రంతా తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. ఉద్యోగుల బదిలీలపై దామోదర రాజనర్సింహకు తెలిసింది... మాకు తెలియదా అని ఎదురు ప్రశ్నించారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండటానికి వీల్లేదని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే గొర్రెల మందకు తోడేళ్లను కాపలా పెట్టినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీయేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.