- టోక్యో సెమినార్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చాలా వనరులున్నాయని, అక్కడి వారికి జపాన్ సంస్థలు నైపుణ్యం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. జపాన్‌లో పర్యటిస్తున్న సీఎం బృందం శుక్రవారం జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), జపాన్-ఇండియా బిజినెస్ కో-ఆపరేషన్ కమిటీ (జెఐబీసీసీ) తదితర సంస్థలు నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. ఏపీలో సహజ వనరులున్నాయని, వాటికి జపాన్ నైపుణ్యాలు తోడైతే అద్భుతాలు సృష్టించగలమని తెలిపారు.
ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీలలో జపనీస్ భాష కోర్సులను ప్రవేశపెడతామన్నారు. జపాన్‌లో భారత రాయబారి దీపా గోపాలన్ వాద్వా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై సీఎం చిత్తశుద్ధిని జపాన్‌లో ఆయన బృందం షెడ్యూల్ స్పష్టం చేస్తుందన్నారు. జెట్రో అధ్యక్షుడు హిరోషి సుకమోటో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రగతి భావాలున్న సీఎం అని ప్రశంసిం చారు. జేఐబీసీసీ స్టాండింగ్ కమిటీ ఇన్‌ఛార్జి మునియె ఓ కరేచి మాట్లాడుతూ శ్రీసిటీకి జపాన్ కంపెనీల ద్వారానే ప్రాచుర్యం లభించిందన్నా రు. టోక్యోలో విలేకరులతో మాట్లాడిన బాబు తన పర్యటన విశేషాలు వివరించారు.
పలు సంస్థల ప్రతినిధులతో భేటీ
చంద్రబాబు బృందం శుక్రవారం జపాన్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ బృందం తొలుత ఇసెకీ కంపెనీని సందర్శిం చింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలపై ఇసెకీ ఎండీ యుకి టయోడా వివరించారు. తమ సంస్థ ఒక్కో యూనిట్‌ను స్థాపించేందుకు 40 మిలియన్ డాలర్లు (సుమా రు రూ.240 కోట్లు) ఖర్చవుతుందని తెలిపారు. ఎస్‌ఎంబీసీ పెట్టుబడుల సలహాదారు ఫ్యుమి యో హోషితో బాబు బృందం సమావేశమైంది. ఏపీలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తామని హామీనిచ్చారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడాలని యూనిక్లో చైర్మన్ యదషహి యనయ్‌ను కోరారు. వైద్య పరికరాల తయారీ కేంద్రాలను నెలకొల్పాలని తోషిబా సీఈవో హిసావో తనాకాను బాబు కోరారు. పరిశీలిస్తామని హిసావో చెప్పారు.
ఓడరేవుల్లో పెట్టుబడులు: హిటాచీ
చంద్రబాబు బృందం హిటాచీ కంపెనీ ఉపాధ్యక్షుడు అకిరా షిమిజుతో కూడా భేటీ అయింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ముఖ్యంగా ఓడరేవుల్లో పెట్టుబడులు పెట్టేం దుకు ఆసక్తిగా ఉన్నట్లు షిమిజు తెలిపారు. తమకు మంచి ప్రోత్సాహకాలతో పాటు అనుసంధానం కావాలని కోరారు. హిటాచీ స్మార్ట్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి అకికో టోబీతో కూడా ఈ బృందం భేటీ అయ్యింది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో తమ అనుభవాలను టోబీ వివరించారు.
సోలార్ పవర్ ప్రాజెక్టులు స్థాపించాలి
ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులను నెలకొల్పాలని సాప్ట్ బ్యాంక్ చైర్మన్ మసా యోషీ సన్‌ను చంద్రబాబు కోరారు. ఏపీలో కూడా సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తామని యోషీ సన్ చెప్పారు. బాబు వెంట ఆయన తీసుకెళ్లిన ప్రజాప్రతినిధుల, అధికారుల బృందం కూడా ఉంది.