నా కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి
♦ ఐఎస్‌బీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీలు ఏ
♦ ఐఎస్‌బీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీలు ఏర్పాటు చేసింది నేనేఐఎంటీ ఐదో స్నాతకోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తన కృషితోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) ఐదో స్నాతకోత్సవం ఆ క్యాంపస్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. ఐఎంటీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘1995 ప్రాంతంలో హైదరాబాద్ అంటే జంటనగరాలు మాత్రమే. నా కృషితోనే ఈ జాబితాలో సైబరాబాద్ చేరింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి హైటెక్ సిటీకి రూపకల్పన చేశా. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), ఐఐఐటీ, ఉర్దూ, నల్సార్ వర్సిటీల స్థాపన జరిగింది.
హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కూడా నా కృషితోనే సాధ్యపడింది’ అని చంద్రబాబు అన్నారు. కొత్తగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయని.. అందుకు తాను అమలు చేసిన మూడు విషయాలను ఉదాహరణగా ప్రస్తావించారు. విశాఖపట్నంలో ఇటీవల ధ్వంసమైన సాధారణ వీధిలైట్ల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను బిగించినట్లు చెప్పారు. ఈ విధానానికి పైసా ఖర్చు కాకపోవడంతోపాటు 40 శాతం విద్యుత్ ఆదా అవుతోందని అన్నారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కూడా ఇదే కోవలోకి వస్తుందన్నారు.
రైతుల నుంచి తీసుకున్న భూమికి బదులుగా అభివృద్ధి చేసిన స్థలాలను రైతులకు అందజేస్తున్నామని.. ఇది గతంకంటే ఐదారు రెట్లు అధిక విలువ కలిగి ఉందన్నారు. దీంతో భూములు ఇవ్వడానికి రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చుతున్నట్లు చెప్పారు. చైనా, అమెరికాలో బంధాలన్నీ యాంత్రికమై పోయాయని.. ఇక్కడ ఆ పరిస్థితి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ఏ దేశానికీ లేని గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద మన సొంతమని.. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఐఎంటీ డైరెక్టర్ డాక్టర్ సతీష్ ఐలవాడి తదితరులు పాల్గొన్నారు.