మీడియాతో మాట్లాడుతున్న సీమాంధ్రులు
కేపీహెచ్‌బీకాలనీ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక... తెలంగాణలోని సీమాంధ్రులపై దాడి జరుగుతోందని పేర్కొంటూ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని కూకట్‌పల్లికి చెందిన పలువురు సీమాంధ్రులు విమర్శించారు. సోమవారం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్‌లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లోని 3.5కోట్ల మంది సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సహా పలు ఐటీ కంపెనీలపై దాడులు చేస్తే... దాన్ని సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణలో క్షేమంగా జీవిస్తున్నామని, చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తమను పావులుగా వాడుకోవద్దన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని.. దీనిపై టీడీపీ, ఏపీ మంత్రివర్గం ఆందోళన పడడం చూస్తుంటే ఏదో తప్పు జరిగిందనే విషయం అర్థమవుతోందన్నారు. ఐటీ ఉద్యోగిని ప్రియదర్శిని మాట్లాడుతూ... ఒక సీఎం ప్రాంతీయ విబేధాలను సృష్టించడం సిగ్గుచేటన్నారు. ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. సామాన్యులు సైతం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎంను ప్రశ్నిస్తున్నారన్నారు. మరో ఉద్యోగి పవన్‌కుమార్ మాట్లాడుతూ... ఐటీ సంస్థలపై దాడులను స్వార్థం కోసం వాడుకుంటున్న చంద్రబాబునాయుడు, నిజానిజాలు తేలాలంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సీమాంధ్రులపై తప్పులు జరుగుతున్నాయంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్‌ఠాగూర్ పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు...
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వారిపై తక్షణం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్రులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం తప్పు చేయడమే కాకుండా, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుయుక్తులు పన్నడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు తీరు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ లక్ష్మినారాయణకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment