గురువారం హన్మకొండలో జరిగిన టీడీపీ వరంగల్ జిల్లా ప్రతినిధుల భేటీలో మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు
వరంగల్ సభలోఏపీ సీఎం చంద్రబాబు
విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం
నిధుల విషయంలో ఏపీకి ఇబ్బంది
అవకాశాలిస్తే పైకొచ్చినవాళ్లు ఇప్పుడు నన్నే విమర్శిస్తున్నారు
టీఆర్‌ఎస్, కేసీఆర్ ప్రస్తావన లేకుండా బాబు ప్రసంగం
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు
సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా మానసికంగా కలసి ఉండాలనేదే తన అభిప్రాయమని ఆయన చెప్పా రు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటే ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.
కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటాపై విద్యుత్ నియంత్రణ సంస్థ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ) ఆమోదం లేదని బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశం గురువారం హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరి గింది. ఈ సందర్భంగా చంద్రబాబు దాదాపు 55 నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పస్తావన లేకుండా మాట్లాడడం గమనార్హం.
కొట్టుకుంటే కోర్టులకు పోవాలి
‘‘సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. లేకుంటే పెద్ద మనుషుల వద్దకు వెళ్లి.. వారు చెప్పినట్లుగా చేద్దాం. రెండు రాష్ట్రాలు కల వవు. ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. సున్నితమైన తెలంగాణ అంశంలో కొందరు ఇబ్బంది పెట్టాలని చూశారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని అప్పుడు చెప్పా. నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, కరెంటు విషయంలో తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయి..’’ అని ఏపీ సీఎం పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మళ్లీ కలిసే అవకాశాలు లేవని, అందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.
నా వల్లే మిగులు బడ్జెట్..
తెలంగాణలో మిగులు బడ్జెట్‌కు తన దూరదృష్టే కారణమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘‘హైదరాబాద్‌తోనే తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తోం ది. రెండు రాష్ట్రాలకు మేలు జరగాలని అప్పుడు నేను అంటే కొందరు రకరకాలుగా మాట్లాడారు. కేంద్రం విభజన అంశాలను పూర్తిగా అమలు చేయడంలేదు. ఏపీకి న్యాయం జరిగేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాను. కొత్త రాజధాని నిర్మించుకోవాలి. హైదరాబాద్ నుంచి అధికారులు వెళ్లాలంటే కష్టంగా ఉంది.
బాబు భద్రతకు పోర్టబుల్ ఆర్‌ఎఫ్ జామర్
చంద్రబాబు భద్రత కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అత్యాధునిక పోర్టబుల్ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్) జామర్‌ను సమీకరించుకుంది. ఇజ్రాయెల్ సంస్థ తయారు చేసిన ఈ వాహనాన్ని తొలిసారిగా సీఎం వరంగల్ పర్యటనలో వినియోగించారు. కేవలం రాష్ట్రపతి, ప్రధాని వంటి వారి భద్రతలో మాత్రమే ఈ జామర్స్ వినియోగం ఉండేది. చంద్రబాబు భద్రత కోసం ఆర్మీ దళాలు కూంబింగ్ సమయంలో వాడే ఈ తరహా జామర్‌ను కొనుగోలు చేశారు.
ఇది ఉన్న ప్రాంతానికి 300 అడుగుల దూరం వరకు పవర్ రేడియో మ్యాగ్నటిక్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాంతం మీదుగా జీఎస్‌ఎం, సీడీఎంఏ, వీహెచ్‌ఎఫ్ (వెరీ హైఫ్రీక్వెన్సీ), యూహెచ్‌ఎఫ్ (అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ) తరంగాలు ప్రయాణించవు. ఫలితంగా ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్, శాటిలైట్ ఫోన్, రేడియో తదితరాలను వినియోగించి ముష్కరులు ఎలాంటి ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ పరిజ్ఞానంతో కూడిన బాంబుల్ని పేల్చలేరు.
అడుగడుగునా నిరసనలే..
హన్మకొండ: చంద్రబాబు వరంగల్ పర్యటనలో అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తాయి. అండగా నిలిచిన తమను మోసం చేశారంటూ ఎమ్మార్పీఎస్ నేతలు.. హన్మకొండలోని కుడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికకు గురువారం వేకువజామున నిప్పంటించారు. ఇక చంద్రబాబు హన్మకొండలోని అదాలత్ వద్దకు రాగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకుని, రోడ్డుపై పడుకున్నారు.
మహిళా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వరంగల్‌లోని భవానినగర్‌లో ఉన్న టీడీపీ కార్యాలయూనికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అంబేద్కర్ విగ్రహం కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ తోరణాలను దహనం చేశారు. కాజీపేటలో చంద్రబాబు ఫ్లెక్లీని తగులబెట్టారు. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు ఏపీ నుంచి, చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి కూడా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.