
గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్లతో మతకాల అపర్ణ
సూర్యాపేట: లక్ష్యానికి పట్టుదల తోడైతే ఫలితం ఎలా ఉంటుందో నిరూపించింది.. సూర్యాపేటకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని మతకాల అపర్ణ. తనకు సాఫ్ట్‌వేర్ రంగం వైపు ఆసక్తి ఉన్నా.. నాన్న కోరిక మేరకు వైద్యరంగం వైపు అడుగులేసి అతని కళ్లల్లో వెలుగులు నింపింది. కాన్పూర్‌లోని రామా మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ చదివి ఒకటి కాదు.. రెండు.. ఏకంగా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు సాధించి ఎనిమిది బంగారు పతకాలు చేజిక్కించుకుని గోల్డెన్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భవాని జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం నర్సింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని మతకాల చలపతిరావు–శైలజ దంపతుల కుమార్తె అపర్ణ. ఈమె చిన్నతనం నుంచి చదువులో ఫస్ట్ ర్యాంకర్ ఏమి కాదు. ఎల్‌కేజీ, యూకేజీ హైదరాబాద్‌లో, 1వ తరగతి ఖమ్మంలోని సెయింట్‌ఆన్స్ స్కూల్‌లో, 2 నుంచి 4వ తరగతి వరకు బేబీమూన్ స్కూల్, 5 నుంచి 7వ తరగతి నార్కట్‌పల్లిలోని శ్రీ విద్యాపీఠ్‌లో, 8 నుంచి 10వ తరగతి వరకు శ్రీచైతన్య ఈ టెక్నో హైస్కూల్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య, ద్వితీయ సంవత్సరం విజయవాడలోని శ్రీచైతన్యలో పూర్తి చేసింది. ఈమె ఇంటర్మీడియట్ వరకు కూడా టాప్ టెన్‌లోనే నిలిచేది. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యూపీసెట్ రాసి అందులో 356 ర్యాంకు సాధించింది. దీంతో ఆగ్రా డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కాన్పూర్‌లో గల రామా మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి, పూర్తి చేసింది.
అన్ని విభాగాల్లోనూ..
అపర్ణ సర్జరీ, మెడిసిన్ విభాగాలతో పాటు యూనివర్సిటీ పరిధిలో టాపర్‌గా నిలవడం, అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చాయి. మంగళవారం యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఎనిమిది బంగారు పతకాలు అందుకుంది. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటైన నాటి నుంచి ఏ విద్యార్థి కూడా ఇన్ని బంగారు పతకాలు సాధించిన చరిత్ర లేదు. దీంతో అపర్ణ 90 ఏళ్ల చరిత్రను తిరగరాసినట్టయింది.
గ్రామీణులకు సేవ చేయడమే లక్ష్యం – అపర్ణ
ఎంబీబీఎస్ పూర్తిచేసి ఎనిమిది బంగారు పతకాలు సాధిస్తానని అసలు ఊహించలేదని అపర్ణ తెలిపింది. ‘విషయమేంటంటే.. సైన్స్ అంటేనే తనకు ఇష్టముండేది కాదు. కానీ మా నాన్న కోరిక మేరకు సైన్స్‌పై మమకారం పెంచుకుని కష్టపడి, ఇష్టపడి చదివా. నాన్న కలను నెరవేర్చడంతో తన ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తనముందున్న లక్ష్యమొక్కటే గ్రామీణ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం’ అని ఆమె తెలిపారు.
కూతురుకు స్వీటు తినిపిస్తున్న తండ్రి
నా కల నెరవేర్చింది..
నాకు చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలన్నా కోరిక ఉండేది. కానీ అప్పట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో డాక్టర్ కోర్సు చేయలేకపోయా. ఎలాగైనా నా కుమార్తె అపర్ణను డాక్టర్‌ను చేయాలనుకున్నా. ఆమె 10వ తరగతి చదివే సమయంలోనే ఆలోచన వచ్చింది. ఐఐటీ కావాలని తనకు కోరిక ఉన్నా నా కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో మరిచిపోలేనివి.
– మతకాల చలపతిరావు, అపర్ణ తండ్రి