ఖాళీగానే... కమిషనరేట్ | appointment of the Commissioner of Police | Sakshi
Sakshi News home page

ఖాళీగానే... కమిషనరేట్

Published Sat, Dec 19 2015 1:12 AM | Last Updated on Tue, Aug 21 2018 9:18 PM

appointment of the Commissioner of Police

ఏడాది గడుస్తున్నా రూపుదిద్దుకోని వ్యవస్థ
పోలీస్ కమిషనర్ నియూమకంతోనే సరిపెట్టిన ప్రభుత్వం
సరిపడా లేని సిబ్బంది.. తగ్గని నేరాలు
మౌలిక సౌకర్యాల కల్పనలోనూ జాప్యం    

 
హన్మకొండ : వరంగల్‌లో పోలీసు కమిషనరేట్ వ్యవస్థ పూర్తిస్థారుులో రూపుదిద్దుకోవడం లేదు. కమిషనరేట్‌గా ప్రకటించి ఏడాది గడుస్తున్నా.. అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మౌలిక వసతుల కల్పన, కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు విషయాల పరిస్థితీ ఇలాగే ఉంది. పోలీసు శాఖ పరంగా గతంలో వరంగల్ అర్బన్‌గా ఉన్న ప్రాంతాన్ని వరంగల్ పోలీసు కమిషనరేట్‌గా ప్రకటిస్తూ 2015 జనవరి 25న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కమిషనరేట్‌గా ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో 13,09,848 జనాభా ఉందని.. ఏటా సగటున 8,768 నేరాలు నమోదవుతున్నాయని పేర్కొంది. న్యాయపరమైన ప్రక్రియను వెంటనే ముగించి పూర్తిస్థాయిలో కమిషరేట్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్తర్వులు వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశ గా నిర్ణయాలు ఏమీ జరగడం లేదు. వరంగల్ అ ర్బన్ ఎస్పీ కార్యాలయం స్థానంలో కమిషనరేట్ అని, డీఎస్సీ కార్యాలయాలు ఉన్న బోర్డుల స్థానంలో అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా పేర్లు మాత్రమే మార్చా రు. కీలకమైన అధికారాల బదిలీ ప్రక్రియ జరగడం లేదు. పోలీసు శాఖకు సంబంధించి బదిలీలు, నియామకాలు వంటి అధికారాలు సైతం అదనపు డెరైక్టర్ జనరల్ ఆధీనంలోనే ఉన్నాయి. అధికారాల బదలాయింపు జరగకపోవడంతో పోలీసు కమిషరేట్ ఏర్పాటుకు అర్థంలేకుండా పోతోందని పలువురు పోలీసు లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 వసతుల కల్పనలోనూ అంతే..
 వరంగల్ పోలీసు కమిషరేట్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పన ప్రక్రియ కూడా ముందుకుసాగడం లేదు. కమిషరేట్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాల కల్పనను వేగంగా పూర్తి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ కొన్ని నెలల క్రితం వరంగల్‌లో ప్రకటించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్, వరంగల్ రూరల్ ఎస్పీ కార్యాలయాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్‌లోనే కొనసాగుతున్నాయి. దీం తో భవనాలు, ఇతర మౌలిక సదుపాయల పరంగా ఇబ్బంది కలుగుతోంది. మరోవైపు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు సిబ్బంది లేరు. దీంతో నేరాల సంఖ్య తగ్గడం లేదు. వరంగల్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 పోలీసు స్టేషన్లు ఉన్నా యి. మరో ఐదు కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కమిషనరేట్‌గా ప్రకటించగానే ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు పక్రియ కాగితాలకే పరిమితమవుతోంది.

అవసరమైన నిధులు లేకపోవడం, పరిపాలన అనుమతుల్లో జాప్యం కారణంగా భవనాల నిర్మాణం మొదలవడం లేదు. భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం రూ.200 కోట్ల వరకు అవసరమవుతాయని జిల్లా అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపారు. కానీ, నిధులు మంజూరవడం లేదు. వరంగల్ రూరల్ పోలీసు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో స్పష్టత రాలేదు. ఇదీ కొత్త భవనాల నిర్మాణానికి అడ్డంకిగా మారుతోంది. ఇలాంటి అడ్డంకులను తొలగించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement