చదువుల చాందినీ! | Arabic University Auditorium Open in Hyderabad | Sakshi
Sakshi News home page

చదువుల చాందినీ!

Published Tue, Oct 15 2019 10:48 AM | Last Updated on Mon, Oct 21 2019 8:36 AM

Arabic University Auditorium Open in Hyderabad - Sakshi

ప్రారంభానికి సిద్ధమైన యూనివర్సిటీ ఆడిటోరియం

సుమారు ఒకటిన్నర శతాబ్దాల సుదీర్ఘ ఘన చరితకు తార్కాణం. ఉత్తమ విద్యకు, అత్యుత్తమ క్రమశిక్షణకు నిదర్శనం. దక్కన్‌లోనే తొలి అరబిక్‌ యూనివర్సిటీగా సువర్ణ అధ్యాయం. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నతస్థాయిలో నిలిచారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయం దేశంలో పేరెన్నిక గన్నది. విద్యాభ్యాసంతో పాటు ఉచితంగా హాస్టల్‌ వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎంతోమంది పేదలకు విద్యాదానం చేస్తోంది. అదే పాతబస్తీ సిబ్లీగంజ్‌లోని జామియా నిజామియా విశ్వవిద్యాలయం. జకాత్, విరాళాలు, విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థిర, చరాస్తులతో వచ్చే ఆదాయంతో ఇది కొనసాగుతోంది. ముస్లిం విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటల వేస్తోంది. అంతేకాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం కొనసాగించడం గమనార్హం. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు రాష్ట్రపతి అవార్డులు సైతం అందుకున్నారు. కొందరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగానూ స్థిరపడ్డారు. ఈ యూనివర్సిటీ మరో రెండేళ్లలో 150 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జామియా నిజామియాలో రూ.14.60 కోట్లతో కొత్తగా నిర్మించిన ఆడిటోరియాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

ఆవిర్భావమిలా..
జామియా నిజామియా యూనివర్సిటీని షేక్‌ ఉల్‌ ఇస్లాం హజ్రత్‌ హఫేజ్‌ మహ్మద్‌ అన్వరుల్‌ ఫారూఖీ ఫజీలత్‌ జంగ్‌ 1872లో స్థాపించారు. ప్రస్తుతం యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా సయ్యద్‌ అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేనీ కొనసాగుతున్నారు. ప్రతి ఏటా అరబిక్‌ కేలండర్‌ ప్రకారం షవ్వాల్‌ 9 నుంచి షాబాన్‌ 15 వరకు ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. 1997లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.11 ఖర్చు కాగా, ప్రస్తుతం రూ.200కుపైగా అవుతోంది. 

ఉచితమే సముచితం..
జామియా నిజామియా విశ్వవిద్యాలయంలో చదువుతో పాటు పుస్తకాలు, దుస్తులు, ఆహారం.. అన్నీ ఉచితమే. యూనివర్సిటీకి అనుసంధానంగా దేశవ్యాప్తంగా 210 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఖురాన్, మాతృభాష, అరబిక్, పార్శీ, మతం, జనరల్‌ నాలెడ్జ్, మ్యాథ్స్, చరిత్ర విభాగాల్లో బోధనఉంటుంది.    

అపురూప గ్రంథాలకు ఆలవాలం..  
ఇక్కడి గ్రంథాలయంలో చేతితో రాసిన పుస్తకాలు దాదాపు 1800కుపైగా కొలువుదీరాయి.  ఉర్దూ, అరబిక్, పార్శీ భాషల్లో లిఖించిన ఈ పుస్తకాలను భద్రపరిచారు. పర్షియన్‌ భాషలో రాసిన ‘మహాభారత’ గ్రంథం ఇక్కడి లైబ్రరీలో ఉంది. దాదాపు 209 పేజీలతో కూడిన ఈ గ్రంథాన్ని అక్బర్‌ కాలంలోని నవరత్నాల్లో ఒకరైన అబుల్‌ ఫాజిల్‌ పర్షియన్‌ భాషలోకి తర్జుమా చేసినట్లు చెబుతారు. వీటితో పాటు 400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్‌ చేతితో రాసిన ‘రోజ్‌ నామ్‌ చా ఆలంగిరీ’ అనే డైరీ సైతం ఇక్కడ ఉండడం విశేషం. 700 ఏళ్ల క్రితం రాసిన 2,200 పుస్తకాలు ఇక్కడి లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. వీటిని చెక్కుచెదరకుండా రసాయాలను అద్దుతూ శుభ్రపరుస్తున్నారు.  

ప్రధాన కోర్సులివే..  
జామియా నిజామియా విశ్వ విద్యాలయంలో మౌల్వీ, ఆలీం, ఫాజీల్, కాలీం తదితర పీజీ ప్రధాన కోర్సులలో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్ల పాటు ఉంటుంది. ఇందులో ఖురాన్‌ తర్జుమా, హదీస్, ఫికా, అకాయత్, కలాం, అరబిక్‌లలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. జామియా
నిజామియా జారీ చేసే ఫత్వా (నిర్ణయాత్మకమైన ఆదేశం)ను దేశం మొత్తం ఆచరించడం విశేషం.  

నేలపై కూర్చునేచదువుకోవాలి..
ఇక్కడి విద్యార్థులంతా నేలపై కూర్చుని చదువుకోవడం ఓ ప్రత్యేకత. టీచర్లు, ప్రొఫెసర్లకు సైతం కుర్చీలు, టేబుళ్లు ఉండవు. నిల్చొని లేదా కూర్చుని విద్యార్థులకు పాఠాలు చెబుతారు. దీవీ తాలీం కాబట్టి.. కూర్చునే విద్యాభ్యాసం చేయాలని ఇక్కడి ప్రొఫెసర్లు చెబుతున్నారు. పరీక్షలు సైతం నేలపై కూర్చునే రాయాలి. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ సైతం తన చాంబర్‌లో నేలపై కూర్చుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంటారు. 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఇదే సంప్రదాయం. పాదరక్షలను కూడా తరగతి గది బయటే విడవాలి. ప్రతి విద్యార్థీ విధిగా కమీజ్‌ ఫైజామా, తతలపై టోపీ ధరించడం ఆనవాయితీ. గడ్డంతో ఉండాలనేది ఇక్కడి నిబంధన.

మూడు పూటలా పౌష్టికాహారం..
అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో విద్యాబోధన ఉంటుంది. విద్యార్థులకు మూడు పూటలా బలవర్థకమై ఆహార పదార్థాలను అందిస్తున్నాం. ప్రతిరోజు మధ్యాహ్నం పొట్టేలు మాసంతో భోజనం అందజేస్తాం. కాలుష్య రహితమైన కిచెన్‌లో కేవలం గ్యాస్‌ ద్వారా ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నాం.– సయ్యద్‌ అహ్మద్‌ అలీ, రిజిస్ట్రార్‌

క్రమశిక్షణతో విద్యాభ్యాసం..
క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. విద్యార్థులు దుర్వ్యవసనాలకు దూరంగా ఉంటారు. గుణాత్మకమైన విద్యను అందజేస్తున్నాం. ఇస్లాం సంస్కృతీ సంప్రదాయాలకనుగుణంగా  విద్యాభ్యాసం అందిస్తున్నాం. కొత్తగా నిర్మించిన ఆడిటోరియాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి కృషి చేస్తున్నాం. – ముఫ్తీ కలీల్‌ అహ్మద్, వైస్‌చాన్స్‌లర్‌

ప్రొఫెసర్‌ అవుతా..
నేను ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఇక్కడ క్వాలిటీ విద్య అందుతోంది. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. బయటి విద్యార్థులకు మాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చెడు వ్యసనాల జోలికి వెళ్లం. నేను ఇక్కడే డిగ్రీ కూడా పూర్తి చేసుకుని అరబిక్‌లో ప్రొఫెసర్‌ అవుతాను.– మహ్మద్‌ అన్వరుల్లా, ఇంటర్‌ విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement