కిషన్‌రెడ్డికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు సవాల్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి చర్చకు రావాలని ప్రభుత్వం విప్ నల్లాల ఓదెలు సవాల్ చేశారు. బొగ్గుబాయిల పర్యటన సమయంలో కిషన్‌రెడ్డి.. గనికార్మికులను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.
మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. ‘కిషన్‌రెడ్డి ఎన్నడైనా బొగ్గుబాయి ముఖం చూశాడా? సింగరేణి కార్మికులు ఎవరో, వారి స్థితిగతులు ఏంటో ఆయనకు తెలుసా? కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు తేడా తెలియని అజ్ఞాని’ అని ధ్వజ మెత్తారు. బీజేపీ అనుబంధ జాతీయ సంఘం బీఎంఎస్.. 1998లో అప్పటి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి పాపం మూట గట్టుకుందని ఓదెలు ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 5,500 వందల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని చెప్పారు.