
స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
* న్యాయం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశాం
* స్టీఫెన్‌సన్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు
* ఆందోళనల ఆధారంగా దాఖలు చేసే పిటిషన్లను విచారించరాదు
* మత్తయ్య తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా
* సోమవారం నిర్ణయం వెలువరిస్తానన్న న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏ-4 నిందితుడు జెరూసలెం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బులుసు శివశంకరరావు తన నిర్ణయాన్ని సోమవారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ తీరును, విచారణ సమయంలోని పరిణామాలను బట్టి ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావుపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ, కేసు విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ స్టీఫెన్‌సన్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై బుధవారం మొదలు పెట్టిన వాదనలను స్టీఫెన్‌సన్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు గురువారం కూడా కొనసాగించారు. కోర్టుల్లో విచారణ పారదర్శకంగా ఉంటేనే న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతుందన్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే, అది న్యాయవ్యవస్థ మనుగడకే ప్రమాదకరం అవుతుందని తెలిపారు. 18న కోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ఈ కోర్టు చేసిన వ్యాఖ్యలు, విచారణ జరిగిన తీరును న్యాయవాదులు గమనించారని, వారి ద్వారా వాటిని తెలుసుకున్న స్టీఫెన్‌సన్ ఈ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసులో తమకు కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు అవసరం లేదని, తాము వ్యక్తం చేస్తున్న భయాందోళనలను పరిగణనలోకి తీసుకుని, కేసు విచారణ నుంచి తప్పుకుంటే చాలని ఆయన తెలిపారు.
తరువాత మత్తయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... స్టీఫెన్‌సన్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని కేసు విచారణ నుంచి తప్పుకుంటే, కేసు ఓడిపోతానని అనుకున్న ప్రతీ వ్యక్తీ న్యాయమూర్తిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ విచారణ నుంచి తప్పుకోవాలని కోరతారని, చివరకు అది చెడు సంప్రదాయానికి దారి తీస్తుందని చెప్పారు. మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో స్టీఫెన్‌సన్ పార్టీ కాదని, అటువంటి వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరమే లేదన్నారు. తరువాత గండ్ర మోహనరావు తిరిగి వాదనలు వినిపిస్తూ... పరిణామాలు అసాధారణంగా ఉన్నందునే ఈ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని తెలిపారు. తమ పిటిషన్‌పై మత్తయ్య కౌంటర్ దాఖలు చేశారని, దానికి తాము సమాధానం ఇస్తామని మోహన్‌రావు తెలిపారు. అయితే రాతపూర్వకంగా ఆ సమాధానాన్ని రిజిస్ట్రీలో దాఖలు చేయాలని, దానిని పరిశీలించి సోమవారం ఈ అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం వెలువరిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు.