స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు | Case Arguments has started of Stevenson petition | Sakshi
Sakshi News home page

స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు

Published Thu, Jun 25 2015 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు

స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై మొదలైన వాదనలు

* తదుపరి విచారణ నేటికి వాయిదా
* అప్పటివరకు మత్తయ్య అరెస్ట్‌పై స్టే కొనసాగింపు
* స్పష్టం చేసిన న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు
* రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా

 
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసులేం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. దాదాపు అరగంటపాటు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బులుసు శివశంకరరావు తదుపరి వాదనల నిమిత్తం విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసును జస్టిస్ శివ శంకరరావు విచారిస్తే తమకు న్యాయం జరగదని, అందువల్ల ఈ కేసు విచారణను తప్పుకోవాలంటూ స్టీఫెన్‌సన్ మంగళవారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తనపై కేసు కొట్టేయాలంటూ గత వారం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తదుపరి విచారణ నిమిత్తం బుధవారానికి వాయిదా వేసిన సంగతీ విదితమే. స్టీఫెన్‌సన్ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు మధ్యాహ్నం 3.30 గంటలకు వాదనలు ప్రారంభించారు. మత్తయ్య పిటిషన్‌పై ఈ నెల 18న జరిగిన విచారణ సందర్భంగా కోర్టు హాలులో చోటు చేసుకున్న పరిణామాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఒక రాష్ట్రంలోని అధికార పార్టీ, మరో రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు పిటిషనర్ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని వివరించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, బిషప్ సెబాష్టియన్ హారీ, ఉదయసింహాలను అరెస్ట్ చేశారని, మరో నిందితుడు మత్తయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. అటువంటి మత్తయ్యను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, టీడీపీ శక్తివంచనలు లేకుండా పని చేస్తున్నాయని కోర్టుకు నివేదించారు.
 
 అందులో భాగంగానే ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు గత విచారణ సమయంలో మత్తయ్య తరఫున హాజరయ్యారని తెలిపారు. పిటిషనర్ కోర్టుకు ఎటువంటి దురుద్దేశాలను ఆపాదించడం లేదని విన్నవించారు. అయితే కోర్టుల్లో న్యాయమూర్తులు ఎలా వ్యవహరించాలన్న విషయంలో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో పలు తీర్పులు వెలువరించిందంటూ వాటిని చదవడం ప్రారంభించారు. అంతలో కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ సమయంలో మత్తయ్య తరఫు  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా స్పందిస్తూ... మత్తయ్య అరెస్ట్‌పై ఇచ్చిన స్టే నేటితో (బుధవారం) ముగియనుందని, అందువల్ల దాన్ని పొడిగించాలని కోరారు. స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తాను నిర్ణయం వెలువరించేంతవరకు లేదా ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుని వేరే న్యాయమూర్తి ఈ కేసు విచారణ చేపట్టేంతవరకు మత్తయ్య అరెస్ట్‌పై స్టే కొనసాగుతుందంటూ జస్టిస్ శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
 
 రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా
 అంతకుముందు ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారించారు. ఈ కేసులో మరిన్ని అదనపు వివరాలను కోర్టు ముందుంచదలిచామని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ఏసీబీ తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి న్యాయమూర్తిని కోరారు. దీనికి న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేశారు.
 
 న్యాయమూర్తి తప్పుకోనవసరం లేదు
 ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై జెరుసలేం మత్తయ్య కౌంటర్ దాఖలు చేశారు. న్యాయమూర్తులను కేసుల విచారణ తప్పుకోవాలంటూ దాఖలయ్యే పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుబ్రతో రాయ్ సహారా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఆ తీర్పును పరిగణనలోకి తీసుకుంటూ స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన ఈ అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని మత్తయ్య తన కౌంటర్‌లో కోర్టును కోరారు. తాను దాఖలు చేసిన పిటిషన్ గురించి న్యాయమూర్తి ముందు ప్రస్తావించే విషయంలో తన తరఫు న్యాయవాదులు అనుసరించిన తీరును ఆయన సమర్థించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement