
ఏంటి.. కొత్తగా దీక్షల డ్రామాలు
సిరిసిల్ల :
‘ఏంటీ కొత్తగా దీక్షల డ్రామాలు. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నాం. మీ ముందే అధికారులతో మాట్లాడాం. మీరు అన్ని తెలిసి దీక్షలు చేస్తామంటే ఏమనుకోవాలి. దీక్షలు చేసి మీరు హీరోలైతే.. మేం అవులగాళ్లమా..’ అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మిడ్‌మానేరు ముంపు గ్రామాల సర్పంచులతో ఘాటుగా మాట్లాడారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో శనివారం ‘ఆసరా’ కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆ సమావేశానికి వచ్చి న మధ్యమానేరు ముంపు గ్రామాల సర్పంచులను పక్కకు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో స మావేశం ఏర్పాటు చేశాం. ఏడాదిన్నరలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పాం. మిమ్మల్ని ఆ సమావేశానికి పిలిచాం. వాస్తవానికి మిమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు చెబుతారని మిమ్మల్ని రమ్మన్నాం కానీ ఇప్పుడు దీక్షలంటూ మీరే కొత్త డ్రామా లు ఆడుతున్నారు...’ అంటూ మంత్రి మండిపడ్డారు. మంత్రి మాటలతో కంగుతిన్న సర్పం చులు.. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ గ్రామాల్లో ఇందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని స మాధానమిచ్చారు.
‘స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మీరు చెబితే వింటారా.. మేం చెబితే వింటారా..’ అంటూ కేటీఆర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘మామీద నమ్మకం లేకుంటే మీ ఇష్టం.. దీక్షలు చేసుకుంటే చేసుకోండి.. నేనింకా అన్నం తిన్లేదు. ఆకలవుతోంది. కోపం వస్తోందంటూ’ మంత్రి పక్క కు వెళ్లిపోయారు. మంత్రిని కలిసిన వారిలో నీలోజిపల్లి సర్పంచ్ కూసరవీందర్, కొడుముంజ సర్పంచ్ నవీన్, మాన్వాడ సర్పంచ్ రామిడి శ్రీనివాస్, రేణుక కనకయ్య, మంజుల ఉన్నారు. మంత్రి మాటలతో ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు బిత్తరపోయారు.