27 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు నిర్వహణ
మొత్తంగా 250 సెంటర్లు ఏర్పాటు
హాజరుకానున్న 52,569 మంది విద్యార్థులు
పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు తేవడం నిషేధం
ఎస్సీఈఆర్‌టీ నుంచి పరిశీలకుడి నియామకం
జిల్లా విద్యాశాఖ అధికారి పి.మదన్‌మోహన్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ‘‘పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.’’ అని జిల్లా విద్యాశాఖ అధికారి పి.మదన్‌మోహన్ తెలిపారు. శనివారం పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)తో డీఈఓగా విధుల్లో చేరిన అనంతరం తన కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మాల్‌ప్రాక్టీస్, కాపీయింగ్ జరగకుండా నిఘా ఏర్పాటుచేసినట్టు చెప్పారు.
ఎస్‌సీఈఆర్‌టీ నుంచి డిప్యూటీ డెరైక్టర్ ఎండీ. నజీముద్దీన్‌ను పరీక్షలకు పరిశీలకుడిగా నియమించామన్నారు. పరీక్షల నిర్వహణపై డీఈఓ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
27 నుంచి ఏప్రిల్ 15 వరకు
పదో తరగతి పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్‌లు నిషేధం. చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద మినహా ఇన్విజిలేటర్లు, విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్లు ఉండకూడదు.
250 సెంటర్లలో...
జిల్లావ్యాప్తంగా 250 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. వీటిలో 227 రెగ్యులర్, 23 ప్రైవేటు సెంటర్లు ఉన్నాయి. మొత్తం 52,569 మంది విద్యార్థులు కాగా రెగ్యులర్ 48,422 మంది, ప్రైవేటు విద్యార్థులు 4147 మంది ఉన్నారు.
250 మంది సీఎస్‌లు..
పరీక్షలకు 250 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 250 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించి శిక్షణ అందించారు. 94మంది జాయింట్ కస్టోడియన్లు, 14 ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు, డీఈఓ, జిల్లా ప్రత్యేక పరిశీలకుడు, 2600 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో భాగస్వాములవుతారు.
ఇన్విజిలేటర్ల నియామకంలో కొత్త విధానం
పరీక్షల నిర్వహణకు ఎస్‌జీటీలను వినియోగించడం వల్ల అనేక పాఠశాలలు మూతపడుతున్నాయి. అందుకే ఈసారి స్కూల్ అసిస్టెంట్లనే ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నాం. లాంగ్వేజ్ పరీక్షల రోజు నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లను, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టుల సమయంలో లాంగ్వేజ్ సబ్జెక్టుల వారు, పీఈటీలు, పీడీలు, యూపీఎస్‌ల నుంచి ఎస్‌జీటీలను వినియోగిస్తున్నాం. సీనియారిటీ ప్రకారంగానే ఆర్డర్లు ఇస్తాం. గౌరవ భృతిని ఆయా ఉపాధ్యాయుల బ్యాంక్ అకౌంట్లలో జమచేస్తాం. మూల్యాంకనానికి కూడా స్పాట్ నియామకాలుండవు. సీనియారిటీ ప్రకారమే ఇస్తారు. సబ్జెక్టుల వారీగా 20 శాతం అదనంగా ఆర్డర్లు ఇస్తారు.
విద్యార్థులకు 75శాతం హాజరు ఉండాలి
హాల్‌టికెట్ పొందడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉండాలి. 12 జూన్ 2013 నుంచి 26 మార్చి 2014 వరకు ఉండే పనిదినాలను లెక్కించి హాజరుశాతం నిర్ణయిస్తారు. మెడికల్ గ్రౌండ్స్, క్రీడాకారులు, ఇతర సహాయ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి 10 శాతం మినహాయింపు ఉంటుంది.
19, 20వ తేదీల్లో జిల్లాకు ప్రశ్నపత్రాలు
మొదటి విడతగా ఈ నెల 19, 20 తేదీల్లో ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుతాయి. రెండో విడతలో ఈ నెల 28, 29, తేదీల్లో అందుతాయి.
నేలమీద కూర్చోబె ట్టవద్దు
పరీక్ష రాసే విద్యార్థులను నేలమీద కూర్చోబెట్టవద్దని ఆదేశాలు జారీచేశాం. సెంటర్లలో విద్యుత్, తాగునీటి వసతి, సరిపడా బెంచీలు ఏర్పాటు చేయాలని చెప్పాం.
90రోజుల పాఠ్య ప్రణాళిక కొనసాగింపు
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమలుచేస్తున్న 90 రోజుల పాఠ్య ప్రణాళికను ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగిస్తాం. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తాం. ప్రీఫైనల్ జవాబు పత్రాలను అదే రోజు మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని లెక్కించాలని, వారు చేసే లోపాలను విద్యార్థులకు తెలిపి వాటిపై అవగాహన కల్పించాలని ఆదేశించాం.