గడప గడపకూ స్వచ్ఛమైన నీరు
సిద్దిపేట జోన్: ఇది ప్రభుత్వ పథకం కాదు.. అరబిందో, బాల వికాస సంస్థ లాంటి సామాజిక సేవ దృక్పథం కలిగిన వారి తోడ్పాటుతో అందిస్తున్న వినూత్న ప్రక్రియ, కొత్త ఒరవడులతో నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రముఖ అరబిందో ఫార్మా లిమిటెడ్ ఆర్థిక సహాయంతో, బాల వికాస స్వచ్ఛంద సంస్థ నేత ృత్వంలో సోమవారం సిద్దిపేటలో తాగునీటి శుద్ధీకరణ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి ఆరోగ్యం ముఖ్యమన్నారు. ఆరోగ్యం బాగుంటేనే వ్యవస్థ బాగుంటుందన్నారు. ఇది సామాజిక సేవ కార్యక్రమమని, సిద్దిపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఉన్న తనకు బాల వికాస సంస్థ, అరబిందోలు చేయూతనందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని 60 గ్రామాల్లో ఎనీటైమ్ వాటర్ పేరిట బాల వికాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన నీరును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇదే ఆలోచనను సిద్దిపేట పట్టణంలో చేపట్టాలని సంక్పలించినట్లు మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే పట్టణంలోని పది ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టి పట్టణ ప్రజలకు నామమాత్ర రుసుముతో తాగునీటిని అందించనున్నమన్నారు. సిద్దిపేట పట్టణంలోని 35 వేల కుటుంబాలకు ఈ పథకం అన్వయింపజేసేందుకు అరబిందో, బాలవికాస్‌లతో చర్చించడం జరిగిందన్నారు.
తన ఆశయానికి చేయూతనందిస్తూ అరబిందో వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి రూ.1.25 కోట్లను ఆర్థిక సహాయంగా అందించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఇదే క్రమంలో తనవంతు సహాయంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి తన సొంత ఖర్చులతో ఉచితంగా క్యాన్‌లు అందిస్తానన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని, ప్రతి గడపకు తాగునీరును అందించే పథకం విజయవంతం కావడమన్నది పట్టణ ప్రజల చేతుల్లో ఉందన్నారు.
అంతకుముందు అరబిందో ఫార్మా లిమిటెడ్ డెరైక్టర్ సదానందరెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు పట్టణ ప్రజల ఆరోగ్యరీత్యా స్వచ్ఛమైన నీరు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయానికి తమ వంతు చేయూతగా నిలిచామన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమమని దీన్ని సద్వినియోగ పర్చుకోవాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణంలో ఈ ప్రక్రియ విజయవంతమైతే వారు ముందుకు వస్తే వారికి తోడ్పాటు అందించడానికి తమ సంస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ ప్రజల ఆరోగ్య బాధ్యతను మంత్రి హోదాలో హరీష్‌రావు తీసుకోవడం అభినందనీయమన్నారు. స్వచ్ఛమైన నాణ్యతా ప్రమాణాలు కలిగిన తాగునీటిని ప్రతి ఇంటికి నామ మాత్ర రుసుముతో అందించాలనుకోవడం ప్రశంసార్హమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాలవికాస్ సంస్థ డెరైక్టర్ శౌరీరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, తహశీల్దార్ ఎన్‌వైగిరి, నాయకులు కొండం సంపత్‌రెడ్డి, చిన్నా, సఫీకూర్ రహమాన్, జంగిటి కనకరాజు, గుండు శ్రీను, శేషుకుమార్, బత్తుల చంద్రం, బొమ్మల యాదగిరి, సామల ఐలయ్యతో పాటు అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు హౌసింగ్‌బోర్డ్, భారత్‌నగర్‌లో వాటర్ ప్లాంట్లను ప్రారంభించి క్యాన్‌లను ఉచితంగా పంపిణీ చేశారు.