కూలీలు రైతులుగా మారాలి
తీసుకున్న భూముల్లో పంటలు పండించాలి
ఆకస్మికంగా తనిఖీ చేస్తా... సాగును పరిశీలిస్తా
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్ : కూలీలను రైతులుగా మార్చే బృహత్తర ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే దళితులకు భూ పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 270 మంది దళితులకు రూ.30 కోట్ల విలువైన 659 ఎకరాలను పంపిణీ చేశామన్నారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన 13 మంది దళితులకు రూ.1.42 కోట్ల విలువ చేసే 38 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా భూమి పత్రాలను శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పట్టాలు పొందిన దళితులు ఆ భూములను సద్వినియోగ పర్చుకోవాలన్నారు. తాను భవిష్యత్తులో ఆకస్మికంగా తనిఖీ చేసి సాగు భూముల స్థితిగతులను పరిశీలిస్తానన్నారు. పంటలు పండించి రైతులుగా నిలదొక్కుకోవాలని సూచించారు.
భూ పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుందన్నారు. గత పాలకులు సాగుకు యోగ్యం కాని భూములను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నట్టు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యంగా ఉన్న భూములను పంపిణీ చేయడమే కాకుండా తొలి పంటకు రుణాలు అందిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో 3.59 లక్షల మందికి ఆసరా పింఛన్లు
పేద వాడికి కడుపు నిండా అన్నం పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆ దిశగా గత 11 ఏళ్లుగా సిద్దిపేట ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందిస్తున్నానని.. ఆ పథకాలు అర్హులకు అందినప్పుడే తనకు సంతోషం కలుగుతుందన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని ఆసరా లబ్ధిదారులకు మలివిడత పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగిన చివరి వ్యక్తి వరకు కూడా పింఛన్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండరాదన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఉండాలని కోరుకోవడం అర్థరహితమన్నారు.
కోనసీమను తలపించేలా సిద్దిపేట
నంగునూరు: సిద్దిపేట ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా తీర్చిదిద్దుతామని రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంత పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలో భూపంపిణీలో భాగంగా రాంపూర్, పాలమాకుల గ్రామాల లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... తపాసులపల్లి దాక వచ్చిన నీళ్లను తడ్కపల్లికి తెచ్చి కాలువల ద్వారా సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. తడ్కపల్లి వద్ద ఆరు వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా సిద్దిపేటతోపాటు హుస్నాబాద్, కోహెడ మండలాల్లోని ప్రతి ఎకరా భూమిని నీళ్లతో తడుపుతామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతన్నకు సాగు నీరందిస్తామన్నారు.
ఇంటి నుంచే ఎరువుల కొనుగోలు..
రైతులు ఇంటి నుంచే ఎరువులు, విత్తనాలు కొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘మీ-సేవ’ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకుగాను మూడు గ్రామాలకో పాయింట్‌ను ఏర్పాటు చేసి నేరుగా రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చరణ్‌దాస్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, నాగలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శివశంకర్, లావణ్య, దువ్వల మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్లు సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్, ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీడీఓ ప్రభాకర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.