
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నా మని, ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే చర్చలకు హాజరవుతామని పేర్కొంది. సోమవారం గవర్నర్ తమిళిసైను కలసిన ఆర్టీసీ ప్రతినిధి బృందం.. అనంతరం మీడియాతో మాట్లాడింది. టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి, ఈయూ నేత రాజిరెడ్డి తదిత రులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ వైఖరిని తప్పుబట్టారు. కార్మికులంతా సమ్మెకు వెళ్లే ముందే తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీకి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
టీజేఏసీ నేతలను ఫోన్లో సంప్రదించగా తామంతా ఢిల్లీలో ఉన్నట్లు చెప్పారని, సమ్మెను మొదలు పెట్టాల్సిందిగా సూచించారన్నారు. దసరా తర్వాత మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మద్దతు కోసం ఆదివారం చర్చలు జరపాలని కోరా మని, కానీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి, ఖమ్మం జిల్లాకు వెళ్లాల్సిరావడంతో టీజేఏసీతో చర్చలకు వెళ్లలేకపోయినట్లు వివరించారు. ఇప్పటికైనా తమకు మద్దతు ఇవ్వాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
కేకే మధ్యవర్తిత్వం అంగీకారమే...
కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలన్న రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సూచనను వారు స్వాగతించారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు కేకే మధ్యవర్తిత్వం వహిస్తే ఆర్టీసీ జేఏసీకి అంగీకార మేనన్నారు. పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు.
సమ్మెపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరాలోచించుకోవాలని, తమను చర్చలకు ఆహ్వానించాలన్నారు.ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, కార్మికులెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోరారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు కృషి చేయాలని, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలెవరూ స్వతహాగా సమ్మెకు మద్దతు ఇవ్వలేదని, ఆర్టీసీ జేఏసీ కోరిన తర్వాతే మద్దతుగా సమ్మెలోపాల్గొన్నట్లు వివరించారు. సమ్మెలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆర్టీసీ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment