పునర్విభజనతోనే రాజకీయ సుస్థిరత | assembly constituencies reorganisation in telangana | Sakshi
Sakshi News home page

పునర్విభజనతోనే రాజకీయ సుస్థిరత

Published Mon, Jan 19 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

assembly constituencies reorganisation in telangana

అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని అఖిలపక్ష రౌండ్‌టేబుల్ భేటీ డిమాండ్
హైదరాబాద్‌లో సమావేశమైన తెలంగాణ, ఏపీ రాజకీయ పార్టీల నేతలు
అవసరమైతే రాజ్యాంగ సవరణ చేపట్టాలి.. కేంద్రంపై ఒత్తిడి పెంచాలి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఇరు రాష్ట్రాలకు చెందిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఇరు రాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరతకు ఇది ఎంతో అవసరమని అభిప్రాయ పడింది.

ఆదివారం హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు (అదనంగా 34) పెంచాలని.. ఏపీలో 175 స్థానాలను 225 (అదనంగా 50)కు పెంచాల్సి ఉందని పేర్కొంది. ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు కావాల్సి ఉన్నా, ఆ ప్రయత్నాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి అమలవుతుందని స్పష్టం చేస్తున్నందున.. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఇరు రాష్ట్రాల నేతలు నిర్ణయించారు. ఇందుకోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని.. ఇరు అసెంబ్లీలు, శాసనమండళ్లలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని రెండు తీర్మానాలు చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రధానిని కలవాలని నిర్ణయించారు.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి..
నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితేనే కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యపడుతుందని.. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను కేంద్రం అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పున ర్విభజన అంశంపై అన్ని పార్టీలు కలిసికట్టుగా ఉన్నాయన్న సంకేతాలను కేంద్రానికి పంపాలని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్ చెప్పారు. ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమయ్యేలా ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ఆదేశించాలని తెలంగాణ టీడీఎల్పీ డిప్యూటీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు.

వెంటనే మొదలు పెట్టాలి...
ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పార్టీల నాయకులు ఒకే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా కేంద్రం మేలుకొని చర్యలు చేపట్టాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు.

రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ డిప్యూటీ నేత గీతారెడ్డి, ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎం.ఎ.ఖాన్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆ పార్టీ ఏపీ నేత రఘునాథ్‌బాబు, సీపీఎం నుంచి పాటూరి రామయ్య, సీపీఐ నుంచి పశ్య పద్మ, ఎంఐఎం నుంచి జాఫ్రీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement