భారీ ప్రాజెక్టులు అనవసరం | Do not need huge projects | Sakshi
Sakshi News home page

భారీ ప్రాజెక్టులు అనవసరం

Published Thu, Mar 23 2017 1:36 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

Do not need huge projects

- కరువు నివారణపై మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్‌ రౌండ్‌ టేబుల్‌
- సమావేశంలో నిపుణుల అభిప్రాయం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు నివారణ తోపాటు వ్యవసాయానికి నీళ్లు అందించేందుకు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పరిష్కారం కాదని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. దివంగత నీటిపారుదల రంగ నిపుణుడు టి. హనుమంతరావు సూచించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని సూచించారు.   ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌)లో కరువు నివారణకు సంబంధించి జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జస్టిస్‌ ఎల్‌.నర్సింహా రెడ్డి, ఇక్రిశాట్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వీరమణి,  కర్ణాటక కరువు పర్యవేక్షక కేంద్రం మాజీ డైరెక్టర్‌ వీఎస్‌ ప్రకాశ్, మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మ య్య, నీటిపారుదల రంగం నిపుణులు ప్రదీప్‌ తలషెరీ, డాక్టర్‌ సోమ్‌కుమార్‌ తోమార్, డాక్టర్‌ డి.నరసింహారెడ్డి, డాక్టర్‌ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సమావేశ వివరాలను ట్రస్ట్‌ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. కరువు నివారణకు హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ఎవరూ ఊహించని ఫలితాలనిచ్చిందని, కరువు కాలంలో, మండు వేసవిలోనూ నీటి లభ్యతతో ఆదుకుందని చెప్పారు. దీనిని రాజస్థాన్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేసి ఎంతో ప్రయోజనం పొందిందని, రాష్ట్రంలోనూ ఆదిలాబాద్‌లో, మెదక్‌జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని గొట్టిగారిపల్లిలో గత 15 ఏళ్లుగా కరువులోనూ నీరు అందుబాటులో ఉంటోందన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా విద్యుత్‌ చార్జీలు, మెయింటెనెన్స్‌ ఇతరాలు కలుపుకుని ఏడాదికి ఎకరానికి రూ.1.28 లక్షల ఖర్చు అవుతుందని తేలిందని చెప్పారు. హనుమంతరావు రూపొందించిన చతుర్విద జలప్రక్రియ ద్వారా ఎకరానికి రూ.7 వేల ఖర్చుతో మూడు పంటలకు నీటిని ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినా ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ పర్యావరణ కమిటీ ఎదుట ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను కోరాలని నిర్ణయించామన్నారు. ఎక్కడ వర్షం పడితే అక్కడే దానిని స్టోరేజ్‌ చేసుకుంటే అది అక్కడే ఉంటుందని, ఇందుకోసం తక్కువ ఖర్చుతో  సులభమైన విధానాన్ని అమలు చేయవచ్చని చెప్పారు. తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రాజస్థాన్‌లో ఈ ప్రక్రియను అమలు చేయించగా లేనిది ఇక్కడ దానిని ఎందుకు అమలు చేయించలేక పోతున్నామో అర్థం కావడం లేదన్నారు.  టి.హనుమంతరావు వద్ద శిక్షణ పొంది, ఆయన సేవలను ఉపయోగించుకున్న వెదిరె శ్రీరాం ఈ ప్రక్రియపై ఇటీవల ముద్రించిన పుస్తకంలో కనీసం హనుమంతరావు ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరమన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement