మంగళవారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, రాధామోహన్ సింగ్, రాష్ట్ర
- తక్షణ సాయం కోరుతూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ వినతి
- కరువు సాయంగా రూ. 3,064 కోట్లు అడిగితే
- రూ. 712 కోట్లు మాత్రమే విడుదల చేశారు
- ఏడు జిల్లాల్లో 231 మండలాలు కరువులో ఉన్నాయి
- త్వరగా నిధులిస్తే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం
- చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ, మంచినీటి కోసం భగీరథ పథకాలు చేపట్టాం
- వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఒక్క విడతే ఇచ్చారు
- కాకతీయ, భగీరథ పథకాలకు ప్రధాని ప్రశంస
- రాష్ట్రంలో కరువు, నీటి ఎద్దడిపై గంటపాటు సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కరువు సాయంగా తాము రూ.3,064 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా రూ.712 కోట్లు మాత్రమే విడుదల చేశారని, తక్షణం మరో రూ.1,000 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. వివిధ రాష్ట్రాల్లో కరువు పరిస్థితులను అంచనా వేసి కార్యాచరణ రూపొందించేందుకు ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మంగళవారం ఢిల్లీలో ప్రధాని కార్యాలయంలో మోదీతో దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్రంలోని ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉన్నారు.
ఈ సమావే శంలో తొలుత ప్రధాని మాట్లాడుతూ... రాష్ట్రాల ప్రత్యేక అవసరాలను అంచనా వేయడానికి, తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కొనడానికి, అలాగే కరువు నివారణకు శాశ్వత చర్యల కోసం అవసరమైన నిధులు అందించాల్సిందిగా కేసీఆర్ ప్రధానిని కోరారు. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో కరువుతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు చేపట్టిన శాశ్వత కార్యక్రమాలను వివరించారు. వీటికి కేంద్రం ఇతోధికంగా సాయం చేయాలని కోరారు. తక్షణ పరిష్కారంగా మంచినీటి సరఫరా, ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే శాశ్వత కార్యక్రమాలుగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేపట్టినట్టు వివరించారు.
231 మండలాలు కరువు
తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని, ఏడు జిల్లాలోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని కేసీఆర్ ప్రధానికి వివరించారు. ‘‘కరువు వల్ల 13.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 21.78 లక్షల మంది రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మీరు ఎంత త్వరగా నిధులు విడుదల చేస్తే మేం అంతే వేగంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వగలుగుతాం. తెలంగాణలో రైతులను రుణ విముక్తులను చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల మందికి చెందిన రూ.17,000 కోట్ల రుణాలు మాఫీ చేశాం. ఇప్పటికే మూడు విడతల మాఫీ జరిగింది..’’ అని ప్రధానికి తెలిపారు. కరువుతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడరాదన్న ముందుచూపుతో 2.82 కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం అందిస్తున్నట్టు వివరించారు. అడవుల శాతం పెంచేందుకు వీలుగా హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు.
కరువును తరిమేందుకు మా ‘మిషన్’ ఇదీ..
తెలంగాణలో కరువును శాశ్వతంగా తరిమి కొట్టేందుకు రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించేలా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టినట్టు సీఎం ప్రధానికి వివరించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు అందుబాటులో ఉంటుందని, భూగర్భ జల మట్టాలు పెరుగుతాయని వివరించారు. గతేడాది మొదటి దశ విజయవంతమైందని, ఈ ఏడాది రెండో దశ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమని ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 40 వేల హెక్టార్లు సాగులోకి తెచ్చినట్టు సీఎం తెలిపారు. మిషన్ కాకతీయతో పాటు కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు ఉన్న వాటాకు అనుగుణంగా ప్రాజెక్టులు కూడా నిర్మిస్తున్నామని, 38 చోట్ల రిజర్వాయర్లు, బ్యారేజీలు కడుతున్నామని ప్రధాని దృష్టికి తెచ్చారు. నీరు అందుబాటులోకి రావడం వల్ల రైతులకు కరువు నుంచి శాశ్వత విముక్తి కలుగుతుందన్నారు.
‘భగీరథ’తో ఇంటింటికీ నల్లా నీరు
వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని సీఎం ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో ఈసారి కూడా ఇదే దుస్థితి వచ్చిందన్నారు. ఫలితంగా బోర్‌వెల్స్, మంచినీటి పథకాలు ఉపయోగంలోకి రావడం లేదని చెప్పారు. ప్రజలకు మంచినీరు అందించడం కోసం ఇప్పటికే రూ.303 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2,420 ఆవాసాలకు ఇతర ప్రాంతాల నుంచి నీటి సరఫరా చేస్తున్నామని, 7 వేలకు పైగా ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకున్నామని వివరించారు. తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యల కోసం రూ.227 కోట్లు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో కరువు వచ్చినా ప్రజలకు మంచినీటికి ఇబ్బంది ఉండరాదన్న లక్ష్యంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టామన్నారు. 24 వేలకు పైగా ఆవాసాల్లో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం చాలా మంచిదని ప్రధాని కొనియాడారు. కార్యక్రమ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.
సీఎం పనుల పురోగతిని వివరిస్తూ... 2017 నాటికి 90 శాతం లక్ష్యం పూర్తవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పునర్ విభజన చట్ట ప్రకారం తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధుల్లో ఇప్పటివరకు ఒక్క విడత మాత్రమే అందాయని, మిగిలిన డబ్బులు అందితే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని సీఎం వివరించారు. నీటిని నిల్వ చేయడానికి, సాగుకు సంబంధించి చారిత్రక ఉదాహరణలు, ఈ అంశంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లోని వ్యర్థ జలాలను ఆయా పట్టణాలకు ఆనుకొని ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సేద్యానికి వినియోగించాలని ప్రధాని సూచించారు. పూడుకుపోయిన జల మార్గాలను గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్‌ను, ఇంకా స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ జల మార్గాల్లో మేట వేసిన మట్టి, ఇసుకను ప్రజల భాగస్వామ్యంతో తొలగించవచ్చని సూచించారు.
భూసార కార్డులు-క్రాప్ కాలనీలపై ప్రశంస
ప్రధానితో భేటీలో సీఎం వివరించిన మరో కార్యక్రమం భూసార కార్డులు-క్రాప్ కాలనీలు. ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు పండించాలో చెబుతూ రైతుల ఉత్పాదక శక్తిని పెంచేలా, లాభదాయకత చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించినట్టు సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా ఇలా క్రాప్ కాలనీలుగా రేఖాచిత్రణ చేసి, తదనుగుణంగా నిర్ధిష్ట వ్యూహాలు రూపొందించవచ్చని మోదీకి కేసీఆర్ సూచించారు. ప్రధాని ఈ సూచనను అభినందించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టినందుకు ప్రధానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం రైతులకు మేలు చేస్తుందన్నారు. కంపెన్సీటరీ అఫారెస్టేషన్ ఫండ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అథారిటీ(కంపా) చట్టానికి సవరణలు చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఫండ్‌ను సమర్థంగా వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలన్న తీర్మానంతో సమావేశం ముగిసింది.