కరువుపై ఏం చేద్దాం?
నేడు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు, మండుతున్న ఎండలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రధానంగా ఏడు అంశాలతో ఈ సమావేశం ఎజెండాను ఖరారు చేశారు. వడగాడ్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, వాతావరణ పరిస్థితులు-వ్యవసాయ సంబంధిత అంశాలు, తాగునీటి సరఫరా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖకు సంబంధించిన అంశాలు ఇందులో చర్చించనున్నారు.
ఖమ్మం మినహా తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, విపత్తుల నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. వడదెబ్బ మృతులకు ఏపీ ప్రభుత్వం గత ఏడాది నుంచే రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం పెంపు.. చెల్లింపులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే కరువుతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదు. పెట్టుబడి సాయంగా ఇచ్చే పరిహారం పంపిణీకి రూ.989 కోట్ల నిధులు కావాలి. కానీ కేంద్రం కేవలం రూ.791 కోట్లు విడుదల చేసింది. దీంతో సరిపడేన్ని నిధులు లేకపోవటంతో ఈ ఫైలు ముందుకు కదలడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపైనా సమావేశంలో చర్చించనున్నారు.