రెండేళ్లలో నీళ్లిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ దరిద్రాలన్నీ తొలగిపోతాయి
♦ మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులకు సీఎం కేసీఆర్ దంపతుల భూమిపూజ
♦ ఏడాదిన్నరలో పంపుహౌజ్ పనులు పూర్తి చేస్తాం
♦ బ్యారేజీ పూర్తికాకున్నా నీళ్లు తీసుకోవచ్చు
♦ మహారాష్ట్ర సీఎంను హైదరాబాద్ రప్పించి తుది ఒప్పందం చేసుకుంటాం
♦ తమ్మిడిహెట్టి, ఛనాఖా-కొరట ప్రాజెక్టులనూ త్వరలో చేపడతాం
♦ కాంగ్రెస్‌కు ఎన్ని నాలుకలో.. ఒక్కో చోట ఒక్కోటి మాట్లాడతారు
♦ ఆరునూరైనా 1,300 టీఎంసీల నీటిని వాడుకుంటామన్న ముఖ్యమంత్రి
♦ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిరాడంబరంగా కార్యక్రమం
♦ గోదావరిలో చిల్లర నాణేలు జారవిడిచిన ముఖ్యమంత్రి
♦ తొలుత కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
♦ అమ్మవారికి కిలో 118 గ్రాముల బంగారు కిరీటం మొక్కు చెల్లింపు
♦ కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు
♦ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మంథని: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయిని అని... మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేసి నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకపోయినా పంపుహౌస్ ద్వారా నీటిని తరలించుకోవచ్చని... ఈ నిర్మాణాన్ని 15, 16 నెలల్లోనే పూర్తిచేస్తామని తెలిపారు. సోమవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు.
పండితుల సూచన మేరకు గోదావరి తల్లికి మొక్కి నదిలోకి చిల్లర నాణేలను జారవిడిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గోదావరి తల్లి తెలంగాణ బీళ్లను తడపాలన్నదే ప్రజల చిరకాల వాంఛ. అన్నిరకాలుగా అధ్యయనం చేసి, మేడిగడ్డ ప్రాంతం తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనం చేకూరుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఏడాదిన్నర, రెండేళ్లలో ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లిస్తాం. అక్కడి నుంచి మిడ్‌మానేరు, అటు నుంచి మెదక్ జిల్లాకు, హైదరాబాద్‌కు నీళ్లు వెళతాయి. బ్యారేజీ నిర్మాణం పూర్తికాకముందే పంపుహౌస్ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశముంది.
15,16 నెలల్లో పంపుహౌస్ నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. ఒకసారి ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండున్నర, మూడేళ్లలో ఉత్తర తెలంగాణలోని సకల దరిద్రాలూ తొలగిపోయే అవకాశముంది’’ అన్నారు. దేవాదుల పథకాన్ని 365 రోజులూ పనిచేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా.. సుమారు 100 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లాకు సరఫరా చేసే వీలుందన్నారు. ప్రత్తిపాకలో రిజర్వాయర్ ద్వారా కాకతీయ కాలువ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు రెండు పంటలు పండించుకోవచ్చని కేసీఆర్ చెప్పారు.
మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు తరలించడం ద్వారా మెదక్ జిల్లాతోపాటు నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు నీళ్లివ్వొచ్చని, హైదరాబాద్‌కు 20 టీఎంసీలు సరఫరా చేయవచ్చన్నారు. ఇక నిజాంసాగర్‌లో 365 రోజులూ నీరుండేలా రూపకల్పన చేశామన్నారు. మంగళవారం నుంచి మంచి రోజులు లేనందున.. సోమవారమే నిరాడంబరంగా భూమి పూజ జరుపుకొన్నామని చెప్పారు. త్వరలో మహారాష్ట్ర సీఎంను హైదరాబాద్‌కు ఆహ్వానించి తుది ఒప్పందం చేసుకుంటామని, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పనుల శంకుస్థాపనను భారీగా నిర్వహిస్తామని తెలిపారు.
కాళేశ్వరంలో రోడ్డు పక్క టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేస్తున్న హరీశ్‌రావు, ఈటల, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు తదితరులు
కాంగ్రెస్‌ది రామాయణంలో పిడకల వేట
రామాయణంలో పిడకల వేటలాగా కాంగ్రెస్ తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదని ీకేసీఆర్ విమర్శించా రు. ‘‘కాంగ్రెస్ జాతీయ పార్టీ. వారికి ఓ పాలసీ ఉండాలి. కానీ తెలంగాణలో ఒక నాలుక, ఏపీలో ఇంకో నాలుక, మహారాష్ట్రలో మరో నాలుకతో మాట్లా డుతోంది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడే 950 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించారు. ఆ మేరకే నీటిని తీసుకుంటున్నం. మరి మహారాష్ట్ర వాళ్లు ఎందుకు ధర్నాలు చేస్తున్నరో వాళ్లకే తెలియాలి. మే నెలలో కూడా ఇక్కడ (కాళేశ్వరం) నీళ్లు పారుతున్నాయి. ఈ నీళ్లు సముద్రంలోకి పోకుండా ఎవరైనా వాడుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా మహారాష్ట్రలోని సిరోంచ తాలుకాలోనూ లక్ష ఎకరాల్లో నీరు పారించుకోవచ్చని ప్రతిపాదించాం. దీనికి ఆ రాష్ట్ర సీఎం అంగీకరించారు. సర్వేలు పూర్తయ్యాయి.
త్వరలో తుది ఒప్పందం చేసుకుంటాం..’’ అని పేర్కొన్నారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నీటిని తీసుకునే ప్రాజెక్టును వదిలేయలేదని.. దాన్ని త్వరలోనే చేపడతామన్నారు. తమ్మిడిహట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 2.5లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అంశాన్ని సాగునీటి శాఖ పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే ఒప్పందం చేసుకుంటామన్నారు. ఇక లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఛనాఖా-కొరటా సహా రెండు బ్యారేజీలను పూర్తిచేసి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, బేల, జైనథ్ మండలాలతోపాటు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 60 నుంచి 70 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని వివరించారు.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
కాళేశ్వరం మహా పుణ్యక్షేత్రంగా రూపుదాల్చుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కాబోతోందని చెప్పారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీ ద్వారా 54 కిలోమీటర్ల పొడవునా రెండు నదుల్లో (గోదావరి, ప్రాణహిత) నీళ్లుంటాయి. అద్భుతమైన బోటింగ్, వన సంపద, పుణ్యక్షేత్రం, నీళ్లు ఒకేచోట లభించే విశిష్టమైన ప్రాంతం కాళేశ్వరం. త్వరలోనే మళ్లీ ఇక్కడికి వచ్చి గెస్ట్‌హౌజ్‌లు, రోడ్ల నిర్మాణం చేయిస్తా. దేవాలయ అభివృద్ధి కోసం తక్షణమే రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా.
దేవాలయానికి కావాల్సిన హంగులన్నీ కల్పిస్తాం..’’ అని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల, హరీశ్‌రావు, పోచారం, ఇంద్రకరణ్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు కె.కేశవరావు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, వి.సతీష్‌కుమార్, కె.విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి బంగారు కిరీటం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారం కిరీటం సమర్పిస్తానని 2012లో కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి వెళ్లిన సందర్భంగా మొక్కిన మొక్కును కేసీఆర్ చెల్లించుకున్నారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న ఉత్తర తెలంగాణ భవన్‌లో ఆదివారం రాత్రి బస చేసిన కేసీఆర్ దంపతులు.. సోమవారం తెల్లవారుజామునే హెలికాప్టర్‌లో బయలుదేరి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. శుభానందాదేవి ఆలయంలో పూజలు చేసి అమ్మవారికి రూ.36లక్షల విలువైన కిలో 118 గ్రాముల బంగారు కిరీటాన్ని బహూకరించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన కన్నెపల్లి చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్ పనులకు భూమిపూజ చేశారు. తర్వాత హెలికాప్టర్‌లో మేడిగడ్డకు చేరుకుని.. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బ్యారేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన మొత్తం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే జరిగింది.
వాటా నీరంతా వాడుకుంటాం..
సమైక్య రాష్ట్రంలో విడుదల చేసిన జీవోల ప్రకారం కృష్ణా, గోదావరి నదుల్లో 1,300 టీఎంసీలపైగా నీటిని తెలంగాణకు కేటాయించారని... ఇప్పుడు తాము చేపడుతున్న ప్రాజెక్టులన్నీ ఆ 1,300 టీఎంసీల పరిధికి లోబడేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీలోని కొన్ని పక్షాలు ఈ విషయంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా హక్కులను మేం సాధించుకోవడానికి.. మా కరువును తరిమేయడానికి.. సాగు, తాగునీటి గోస తీర్చడానికే. ఆరునూరైనా ఈ 1,300 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుని తీరుతది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మించి తీరుతాం.. దీనిని ఎవరూ ఆపలేరు. ఇప్పటికైనా వారు పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి..’’ అని సూచించారు.