శాసనసభలో జాతీయ గీతం వస్తున్న సమయంలో మా వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరిగినట్లు తేలినా.. వందసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం.
తప్పు చేస్తే క్షమాపణ చెబుతాం
శాసనసభలో జాతీయ గీతం వస్తున్న సమయంలో మా వైపు నుంచి ఎలాంటి తప్పిదం జరిగినట్లు తేలినా.. వందసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. పూర్తిస్థాయి వీడియోలు చూపకుండా క్షమాపణ చెప్పాలని కోరడం భావ్యం కాదు. జాతీయ గీతం, దేశభక్తిపై అనవసర చర్చ శోచనీయం. -టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
అసెంబ్లీ సాక్షిగా దాడి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సాక్షిగా టీడీపీ సభ్యులపై దాడిచేశారు. దాని సీడీని మాయం చేసి, అఖిలపక్షంలో కొన్ని క్లిపింగ్స్ మాత్రమే చూపించారు. స్పీకర్ సైతం అధికారపక్షానికి వంతపాడుతున్నారు. జాతీయ గీతం ఆలపించే ముందు ప్రకటన చేయలేదు. నేరుగా ప్రారంభించారు. అయినా మేం వెంటనే సెలైంట్‌గా ఉండిపోయాం. కానీ అధికారపక్షంపై గొంతు విప్పినందుకు సస్పెన్షన్ చేసి బయటికి పంపారు. - ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ ఎమ్మెల్యే
క్షమాపణ చెప్పిస్తే బాగుండేది..
గవర్నర్ ప్రసంగం సందర్భంగా తోపులాట, ఘర్షణ సభా మర్యాదలను తగ్గించడమే. జాతీయ గీతాన్ని అగౌరవపర్చడం సరైంది కాదు. అసెంబ్లీ సాక్షిగా గుండాల్లా వ్యవహరించారు. తప్పు ఎవరు చేసినా క్షమాపణ చెప్పాల్సిందే. టీడీపీ సభ్యులు ఒకవేళ తప్పు చేసివుంటే క్షమాపణ చెప్పిస్తే బాగుండేది. సస్పెండ్ చేయడం బాధాకరం. ఇప్పటికైనా అధికార పక్షం పునరాలోచించాలి.
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
తప్పును కప్పిపుచ్చుకుంటున్న అధికారపక్షం
అధికారపక్ష సభ్యుల తప్పులను కప్పిపుచ్చుతూ ఇతర పక్షాల వారిని తప్పుగా చూపిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షాలపై గుండాయిజం ప్రదర్శించారు. ఎవరు త ప్పు చేసినా క్షమాపణ చెప్పాలిందే.
- సంపత్‌కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే
సర్కారుది నియంతృత్వం
సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఏకపక్ష నిర్ణయం. ప్రతిపక్షాలను విస్మరించారు. సభ్యుల సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికార పక్షం నియంతగా వ్యవహరిస్తోంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి ఇతర పక్షాల సభ్యులను భయపెట్టాలని చూస్తున్నారు. - రవీంద్ర నాయక్, సీపీఐ ఎమ్మెల్యే
ప్రతిపక్షాలు లేకుండా నడిపించుకుంటారా?
బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు లేకుండా నడిపిం చుకుంటారా? ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు తగవు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం, జాతీయగీతం సందర్భంగా జరిగిన ఘటనకు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే క్షమాపణ చెప్పాలా? అధికార పక్ష సభ్యుల కు వర్తించదా? పూర్తి స్థాయి వీడియోను చూపించాలి. - లక్ష్మణ్, ప్రభాకర్, చింతల, బీజేపీ ఎమ్మెల్యేలు
దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సుమారు పదిలక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే
ఫిరాయింపులు కొత్తేమీ కాదు
పార్టీ ఫిరాయింపులు కొత్తేమీకాదు. చట్టం దానిపని అది చేస్తోంది. ఏపీలో చంద్రబాబు ఇతర పార్టీ వారిని టీడీపీలో చేర్చుకుంటే అది సంసారం.. తెలంగాణలో మేం చేర్చుకుంటే వ్యభిచారమా..? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫిరాయింపులు జరిగాయి. బంగారుతెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకే పార్టీలో చేరుతున్నారు. - జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
దళితుల పట్ల టీడీపీ కపట ప్రేమ
టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జాతీయ గీతాన్ని అగౌరవపర్చారు. చంద్రబాబు డెరైక్షన్‌లో దళితుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. వారు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి దళితుడు, టీఆర్‌ఎస్‌లో చేరితే దళితుడు కాదా..? వారు దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే. - రసమయి బాలకిషన్, బాలరాజు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ఉద్యమంలో కలిసి రాలేదు
ఉద్యమంలో కలిసి రాలేదు. కనీసం ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా టీడీపీ సభ్యులు కలిసి రావడం లేదు. సభలో ప్రజల పక్షాన మాట్లాడితే వారుహర్షిస్తారు. రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అగౌరవపర్చే విధంగా వ్యవహరిస్తే గుణపాఠం తప్పదు. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.