
వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తున్న బీజేపీ నేత మురళీధర్‌రావు
దామరచర్ల (మిర్యాలగూడ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి కృష్ణా–మూసీ నదుల సంగమంలో గురువారం నిమజ్జనం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో వాజ్‌పేయి అస్థికల కలశాన్ని సంగమం వద్దకు తీసుకువచ్చారు. బ్రాహ్మణులు వేద మంత్రాల నడుమ ఆ కలశాన్ని పుణ్యజలంతో అభిషేకించిన అనంతరం సంగమంలో నిమజ్జనం చేశారు.
మురళీధర్‌రావు మాట్లాడుతూ, అటల్‌జీ దేశాభివృద్ధికి కన్న కలలను నిజం చేయడమే ఆయనకు మనమిచ్చే నివాళులన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అటల్‌జీ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన చితాభస్మాన్ని దేశంలోని 150 నదుల్లో కలుపుతున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నేతలు మనోహర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, పాదూరి కరుణ, నూకల నర్సింహారెడ్డి, సాంబయ్య, బాబా, దొండపాటి వెంకటరెడ్డి, కర్నాటి ప్రభాకర్, బంటు సైదులు పాల్గొన్నారు.