వన నర్సరీలో పందుల దాడిలో ధ్వంసమైన మొక్కలు
ధారూరు : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల మొక్కలు పనికిరాకుండా పోయాయి. విత్తనం మొలకెత్తి పాలిథిన్ కవర్లలో మొక్కగా రూపుదిద్దుకుంటున్న ఈత మొక్కలను అర్ధరాత్రి అడవి పందులు గుంపు నాశనం చేసింది. అడవిలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన వన నర్సరీలో జరిగిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది.
ధారూరు మండలంలోని రుద్రారం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ వన నర్సరీలో ఈ ఘటన చోటుసుకోగా అటవీశాఖ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఫారెస్టు ఉన్నతాధికారులకు మాత్రం సమాచారం అందించారు. వివరాలిలా ఉన్నాయి. రుద్రారం సెంట్రల్ వన నర్సరీలో అల్లనేరేడు 50 వేలు, ఈత 50 వేలు, పండ్ల రకం, ఇతర రకాలకు చెందిన లక్ష మొక్కలను నాటేందుకు పాలిథిన్ కవర్లలో విత్తనాలను పెట్టి పెంచుతున్నారు.
5బై6 సైజు పాలిథిన్ కవర్లలో వేసిన విత్తనాలు అరడుగు వరకు మొక్కలుగా పెరిగాయి. అయితే అర్ధరాత్రి అడవి పందుల గుంపు వన నర్సరీపై దాడిచేసి కవర్లలో ఉన్న అన్ని రకాల విత్తనాలను తినేందుకు ప్రయత్నిస్తూ మొక్కలున్న ప్రతి కవర్‌ను చిందర ‡వందరగా చేసేశాయి. పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పందులు నాశనం చేసిన విషయం తెలియని సిబ్బంది, పనులు చేసే కూలీలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఎవరైనా గిట్టని వారు చేసిన పనేనని తొలుత భావించినా అడవి పందుల కాలి గుర్తులు ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ధారూరు ఫారెస్టు రేంజర్ సీహెచ్ వెంకటయ్యగౌడ్ సిబ్బందితో వెళ్లి పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలన్ని ధ్వంసం కావడం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ విషయాన్ని ఆయన జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విత్తనాలతో మొక్కలను పెంచుతున్న వన నర్సరీపై ఇలాగే అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేస్తే పరిస్థితి ఏంటనే మీమాంసలో అధికారులు పడినట్లు తెలిసింది.
ఆందోళనలో రైతులు
ఇటీవల వేసిన వివిధ రకాల విత్తనాలు వర్షాలు లేక మొలకెత్తకుండా భూమిలోనే ఉన్నాయి. అడవి పందులు సాళ్లను మూతితో తోస్తూ భూమిలోని విత్తనాలను తినేస్తున్నాయి. దీంతో అసలే వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు పందుల బెడద నిద్ర లేకుండా చేస్తోంది. భూమిలో ఉన్న విత్తనాలు వర్షాలు పడితే మొలకెత్తుతాయని ఆశిస్తున్న రైతులకు అడవి పందుల బెడద ఆశనిపాతంలా దాపురించిందని వాపోతున్నారు.
అడవి పందులు భూమిలోనే మట్టిని వదిలేసి వేసిన విత్తనాలే తినేస్తున్నాయని రైతులు తెలిపారు. ఉన్నతాధికారికి చెప్పాం.అడవి పందుల గుంపులు వన నర్సరీలోని 2 లక్షల పాలిథిన్ కవర్లలో ఉన్న మొక్కలను ధ్వంసం చేశాయి. వాటి గురించిన వివరాలను ఉన్నతాధికారులకు చెప్పాం. అడవి పందులు సమీపంలో ఉన్న వన నర్సరీలోకి తరచూ ప్రవేశించి ధ్వంసం చేస్తున్నాయి. పందులు గుంపులు గుంపులుగా రావడంతో కాపలా సిబ్బంది ఏం చేయలేని పరిస్థితి. అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే దాడి చేస్తున్నాయి.
– రేంజర్, సీహెచ్ వెంకటయ్యగౌడ్ రుద్రారం
Comments
Please login to add a commentAdd a comment