- స్థానికులు రావడంతో మంగళసూత్రం పడేసి పరార్
లంగర్‌హౌస్: పట్టపగలు దుండగుడు బరితెగించాడు. అపార్ట్‌మెంట్‌లోని 4వ అంతస్తులోకి వెళ్లి మహిళపై కర్రతో దాడి చేసి, కత్తితో గాయపర్చి మంగళసూత్రం దోచుకున్నాడు. స్థానికులు రావడంతో మంగళసూత్రాన్ని అక్కడే పడేసి పారిపోయాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... లంగర్‌హౌస్ బాపూనగర్ బస్టాప్ ప్రాంతం నిత్యం నగర శివార్లతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ బస్టాప్ ఎదురుగా ఉన్న ఓం చైతన్య సమృద్ధి అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులోని 303 ఫ్లాటులో ఐఐఐటీఉద్యోగి, ప్రముఖ సంగీతకారుడు దేవీప్రసాద్, సుధారాణి దంపతులు నివసిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 12.30కి దాదాపు 25 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువకుడు అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి దేవీప్రసాద్ ఫ్లాటు తలుపు తట్టాడు. రోజు అదే సమయంలో దేవీప్రసాద్ ఇంటికి వస్తుండటంతో ఆయనే అనుకొని భార్య సుధారాణి తలుపు తీసింది. తనతో తెచ్చుకున్న కర్రతో వెంటనే ఆ దుండగుడు ఆమె తలపై కొట్టాడు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్దుతూ గాయపరిచాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో చేతిని గాయపరిచి.. ‘‘అరిస్తే చంపేస్తా’నంటూ మెడపై కత్తి పెట్టాడు.
తర్వాత ఆమె మెడలోని 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అలికిడికి చుట్టు పక్కల ఫ్లాట్ల వారు బయటకు రావడంతో గమనించిన దొంగ మంగళసూత్రాన్ని అక్కడే పడేసి మెట్ల మీదుగా పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సుధారాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.