నేడు ఆటో, క్యాబ్‌ల బంద్‌ | Auto and cabs bandh is today | Sakshi
Sakshi News home page

నేడు ఆటో, క్యాబ్‌ల బంద్‌

Published Tue, Jan 8 2019 1:10 AM | Last Updated on Tue, Jan 8 2019 1:10 AM

Auto and cabs bandh is today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు మంగళవారం బంద్‌ పాటించనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తదితర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతునిస్తున్న నేపథ్యంలో బస్సుల రాకపోకలపై కూడా బంద్‌ ప్రభావం ఉండనుంది. అయితే ప్రధాన కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌) మాత్రం సమ్మెకు దూరంగా ఉండనుంది. ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఆ సంఘం ప్రకటించింది.  

ఎక్కడికక్కడే స్టాప్‌.. 
సమ్మె నేపథ్యంలో లక్షకు పైగా ఆటోరిక్షాలు, మరో 50 వేల క్యాబ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఓలా, ఊబెర్‌ క్యాబ్‌లు, 25 వేలకు పైగా స్కూల్‌ ఆటోలు, వ్యాన్‌లు కూడా ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెను కొనసాగించనున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్, సత్తిరెడ్డి.. తెలంగాణ టాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్, ప్రతినిధులు ఈశ్వర్‌రావు, కొండల్‌రెడ్డి ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తేయాలని.. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

తిరగనున్న రైళ్లు.. 
రైల్వే కార్మిక సంఘాలు సైతం సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా ఉంటాయి. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లతో పాటు, నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణికులకు సదుపాయం అందజేసే ఎంఎంటీఎస్‌ రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మెట్రో రైళ్లు కూడా యథావిధిగా తిరుగుతాయి.  

బస్సులపై ప్రభావం.. 
సమ్మెకు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల పైనా పాక్షికంగా ప్రభావం పడే అవకాశముంది. గ్రేటర్‌లో ప్రతి రోజూ 3,850 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 32 లక్షల మంది ప్రయాణిస్తారు. బంద్‌ ప్రభావం కారణంగా ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే సిబ్బంది వల్ల కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోవచ్చు. అయితే సాయంత్రం అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement