సమావేశంలో దానకిశోర్, అంజనీకుమార్, శిఖాగోయల్, రాజకీయ పార్టీల నాయకులు
ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృతఅవగాహన కల్పించేందుకు చైతన్యబృందాలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్లు చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చైతన్య బృందాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 92 చైతన్య బృందాలతో ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనల కనుగుణంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు పోలింగ్‌కు హాజరయ్యేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు.
జిల్లాలో ప్రస్తుతమున్న 41,62,215 మంది ఓటర్లతోపాటు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకునే వారికి పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన మార్చి 25వ తేదీకి 10 రోజుల ముందుగా అంటే మార్చి 15 వరకు స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నదీ? లేనిదీ? సరిచూసుకోవాల్సిందిగా ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌లు పంపించామన్నారు. ఎన్‌వీఎస్‌వీ పోర్టల్, సీఈఓ వెబ్‌సైట్లలో తమ పేర్లను చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3,976 పోలింగ్ కేంద్రాలుంటాయన్నారు. ప్రచారానికి సంబంధించి ఎకోఫ్రెండ్లి సామగ్రినే వా డాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి హైదరాబాద్ జిల్లాలో 374 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 42 స్టాటిక్ çసర్వైలెన్స్ టీమ్స్, 42 వీడియో సర్వైలెన్స్ టీమ్స్, 14 వీడియో వ్యూయింగ్ టీమ్స్, 14 అకౌంటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు.
10 వాహనాలకే అనుమతి...
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ... మంగళవారం రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏవిధమైన అనుమతులు కావాలన్నా ఈ–సువిధ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 7వేల మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. రోడ్ షోలకు 10వాహనాలకు మించి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాణిక్‌రాజ్ కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, సికింద్రాబాద్ లోక్‌సభ రిటర్నింగ్ ఆఫీసర్ రవి, అడిషనల్ పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, ఆయా పార్టీల నాయకులు ఎంఎస్ ప్రభాకర్, జాఫ్రీ, మర్రి శశిధర్‌రెడ్డి, వనం రమేశ్, పి.వెంకటరమణ పాల్గొన్నారు.
సిబ్బందికీ అవగాహన అవసరం...
ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై ఎన్నికల సిబ్బందికి కూడా తగిన అవగాహన లేదని.. వారికీ తగిన శిక్షణ అవసరమని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లకు సంబంధించి ఈవీఎంల లెక్కకు, ఏజెంట్ల లెక్కకు, వీవీప్యాట్‌లలో లెక్కకు తేడా ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు అవగాహనలేమితో వీవీప్యాట్లలోని స్లిప్‌లను తొలగించారని గుర్తుచేశారు. పోలింగ్ ముగిశాక గంటలు గడిస్తే గానీ శాతం ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయా అంశాలకు సంబంధించిన ధరల పట్టిక వాస్తవంగా లేదని, సవరించాలని కోరారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ సక్రమంగా జరపాలన్నారు. సున్నిత ప్రాంతాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లోని వారికి నాణ్యమైన ఆహారాన్ని సరిపడా అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment