వైరల్‌గా ‌ మారుతున్న కరోనా పాటలు | Awareness Songs On Coronavirus | Sakshi
Sakshi News home page

వైరల్‌గా ‌ మారుతున్న కరోనా పాటలు

Published Sat, Apr 25 2020 10:50 AM | Last Updated on Sat, Apr 25 2020 12:44 PM

Awareness Songs On Coronavirus - Sakshi

సాక్షి, వరంగల్‌ : ఎక్కడ చూసినా కరోనా వైరస్‌ కు సంబంధించిన మాటలు.. పాటలే వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్లే ఇది సాధ్యమవుతుందని గ్రహించి.. ముందుకు సాగుతున్నారు. వైరస్‌ నియంత్రణకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న కృషితో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి బాధ్యతను వివరిస్తూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కళాకారులు, రచయితలు పాటలను రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్‌ నియంత్రణకు పాటించాల్సిన సూచనలు, సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటలను రూపొందించారు. గల్లీ కళాకారుడి నుంచి సినిమా రంగంలో రాణిస్తున్న కళాకారుల వరకు స్వయంగా పాటలు రాసి పాడారు. (విమానం ఎక్కాలంటే మాస్క్‌లు ఉండాల్సిందే)

ప్రాణం ఉంటే చాలన్నా..
ప్రాణం ఉంటే చాలు.. బలుసాకు తిని బతుకుందాం.. అనే పాటను వరంగల్‌కు చెందిన ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యాం రచించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం చెప్పినట్లు విందామంటూ పాట ద్వారా వివరించారు. ఈ పాటను గాయని మంగ్లీతో కలిసి పాడారు. వీడియోతో కూడిన ఈ పాటను ఈనెల 18న మంగ్లీ యూ ట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటి వరకు 42వేల మందికి పైగా విక్షించారు. అలాగే ‘గుండె చెదిరి పోకురా.. గూడు ఒదల మాకురా’ అనే వీడియో సాంగ్‌ను సైతం కాసర్ల శ్యాం రచించారు. ఇందులో మంచు మనోజ్‌ నటించారు. ఈ పాటను ఇప్పటి వరకు 1.3లక్షల మంది వీక్షించారు.

డాక్టరు.. మా డాక్టరు..
‘డాక్టరు మా డాక్టరు.. దేశ ప్రాణ దాతవే డాక్టరు’.. అనే పాటను మహబూబాబా ద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన గిద్దె రాంనర్సయ్య రచించి పాడారు. తెలంగాణ పాటలు అనే యూ ట్యూబ్‌ చానల్‌లో ఏప్రిల్‌ 8న అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటి వరకు 3వేల మందికిపైగా వీక్షించారు.

‘వినరా భారత వీర కుమారా.. 
‘వినరా భారత వీర కుమారా.. కరోనా’ అనే సాంగ్‌ను వరంగల్‌కు చెందిన యువకులు రూపొందించారు. లాక్‌ డౌన్‌ ఉండంతో ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లకే పరిమి తమై పాటను రూపొందించారు. మొదట ట్యూన్స్‌ను నగరంలోని పుప్పాలగుట్టకు చెందిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ పవన్‌ గందమాల పరకాలకు చెందిన గేయ రచయిత ఈశ్వర్‌ ప్రసాద్‌కు పంపించగా.. ఆయన పాట రాసి పంపించాడు. అదే పాటను హన్మకొండకు చెందిన గాయకుడు వంశీ క్రిష్ణకు పంపించగా స్టూడియోలో రికారి్డంగ్‌ చేసి ఫోన్‌ ద్వారా పవన్‌కు పంపించాడు. దీంతో పాటకు మ్యూజిక్‌ యాడ్‌ చేసి రూపొందించారు. ఎడిటింగ్‌ వర్క్‌ ఎనోష్‌ కూలూరి పూర్తి చేశారు. పవన్‌ గందమాల తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఈనెల 6న పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు 3వేల మందికి పైగా వీక్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement