
సాక్షి, ఖమ్మం : టీమిండియా క్రికెట్ జట్టు తరహాలో మహాకూటమి కూడా బలంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు (ఆదివారం) ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మకైనాయని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని అజహరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు.
ముస్లింలకు టీఆర్‌ఎస్ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ హామీ ఏమైందని అజహరుద్దీన్ ప‍్రశ్నించారు. నాలుగున్నర ఏండ్ల పాలనలో హామీల అమలులో టీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. హామీల గురించి ప్రశ్నించే వారిపై సీఎం కేసీఆర్ అసహనంతో, అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తిస్తారని అజహర్ విమర్శించారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు,కోదండరాం కలయిక క్రికెట్ లో తాను, సచిన్ ల భాగస్వాముల మాదిరిగా విజయం సాధిస్తుందన్నారు. ఖమ్మంలో అభివృద్ధి కోసం ప్రజా కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment