జగ్జీవన్ రాం చిత్రపటానికి నివాళిలు అర్పిస్తున్న నాయకులు
రెబ్బెన: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష సేవలు అందించిన బాబు జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగించేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా అధ్యక్షుడు బోడ భద్రు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోషియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు గోపాలక్రిష్ణ సూచించారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్ లోని తెలంగాణ విగ్రహం వద్ద బాబు జగ్జీవన్ రాం 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి హరిజన, గిరిజన, బహుజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని హరిజన, గిరిజనులతో పాటు బడుగు, బలహీన వర్గాలు ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధి మార్గంలో ముందుండి నడవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోవచ్చన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిబాటలో నిలవాలన్నారు. బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకున్న వారిలో బాబు జగ్జీవన్‌రాం ముఖ్యుడన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశ స్వాతంత్య్రం కోసం పాటు పడ్డారన్నారు. ప్రజానాయకుడిగా పేరు పొందటంతో పాటు సుధీర్ఘకాలం పాటు పార్లమెంటు సభ్యులుగా పని చేసి ఎన్నో పదవులు అదిష్టించారన్నారు. పీడిత, తాడిత ప్రజల ఆశాజ్యోతిగా పేరుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి మహోన్నతుడి ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి జాదవ్ సంజేష్, నాయకులు అంజనేయులుగౌడ్, లింగంపల్లి ప్రభాకర్, మల్రాజు రాంబాబు, కోరాల రాజేందర్, పోషం, శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment