కల్యాణ లక్ష్లి
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రిలో ఆడశిశువు మృతి చెందడంతో ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శిశువుకు ఫిట్స్ రావడం వల్లే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం శివారులోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ భార్య లకితకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు.
శుక్రవారం ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో పాప పుట్టింది. కొద్దిగా పసిరికలు కనిపించడంతో ఎన్‌బీఎస్‌యూలోని బాక్సులో ఉంచారు. సోమవారం ఉదయం నుంచి ఫిట్స్ రావడంతో పిల్లల వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని, పాప ఊపిరితిత్తుల్లో కూడా ఇన్‌ఫెక్షన్ ఉందని తెలిపారు. మధ్యాహ్నం వరకు పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. ఈక్రమంలో మూడు రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న పాప ఆకస్మాత్తుగా ఎలా చనిపోతుందంటూ బాధిత కుటుంబీకులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు.
ఆస్పత్రిలో కాసేపులో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ బోర్కర్ సురేశ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రజినీ అక్కడికి చేరుకున్నారు. వారితోనూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
తల్లి లకితకు ఇవ్వాల్సిన యాంటీ–డీ ఇంజక్షన్ ఇవ్వకపోవడం వల్లే ఇది జరిగిందని పేర్కొన్నారు. వైద్యులు దీన్ని కొట్టిపారేస్తూ.. ఆ ఇంజక్షన్‌కు శిశువు మృతికి సంబంధం లేదని, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండటం వల్ల ఫిట్స్ వచ్చి చనిపోయిందని వివరించారు. అనంతర శిశువు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment