ఆ భూమిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదు
♦ ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయరాదు
♦ ‘దేవతలగుట్ట’పై రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ దేవతలగుట్టపై ఉన్న 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశిం చింది. ఆ భూమిలో ఎటువంటి విగ్రహాలనూ ఏర్పాటు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ భూములు, భవనాలను మరొకరికి బదలా యించడం గానీ, అన్యాక్రాంతం చేయడానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే సమయం లో ఏ భవనాన్ని కూల్చవద్దని అధికారులను ఆదేశించింది. దేవతలగుట్టపై ప్రైడ్ ఇండియా సంస్థ ఎటువంటి అనుమతులు తీసుకోకుం డానే భారీ విల్లాలు నిర్మించిందని తేలుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిన నివేదికపై అభ్యంతరాలుంటే తెలపాలని అటు ఆ సంస్థ యాజమాన్యాన్ని, భవన యజమానులను హైకోర్టు ఆదేశించిం ది.
తదుపరి విచారణను 4 వారాలకు వాయి దా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేవతలగుట్టపై ఉన్న వీరభద్ర స్వామి, ఇతర దేవాలయాలను కూల్చివేయ డమే కాకుండా 150ఎకరాల ప్రభుత్వ భూమి లో ప్రైడ్ ఇండియా బిల్డర్స్ పెద్ద ఎత్తున నిర్మా ణాలు చేపడుతోందని, దీనిపై అ«ధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ దేవతల గుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాం రామ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం గురువారం మరో సారి విచారణ జరిపింది.
ఆరోపణలు వాస్తవమేనన్న కమిటీ
ఈ భూముల్లో తదుపరి ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా ప్రైడ్ ఇండియా సంస్థ భారీ విల్లాలను నిర్మిస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ధర్మాసనం హైకోర్టు రిజిష్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన కమిటీ పరిశీలన జరిపి.. నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచింది. వందల సంఖ్యలో ఫొటోలను కోర్టుకు సమర్పించింది.
ఈ నివేదికను, ఫొటోలను గురువారం నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పరిశీలించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రైడ్ ఇండియా సంస్థ నిర్మాణాలను కొనసాగించిందని కమిటీ తేల్చింది. ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, 80 శాతం విల్లాల నిర్మాణం పూర్తయిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పి.ఎస్.పి. సురేశ్‌కుమార్ స్పందిస్తూ, ప్రైడ్ ఇండియా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. లేఔట్‌కు సైతం హుడా అనుమతి లేదన్నారు.
ఈ భూమికి సర్వే నెంబర్ 85, 86లోని భూమికి ఏ మాత్రం సంబంధం లేదని, తమ భూముల్లో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టింప చేసేందుకు పిటిషనర్ ప్రయత్ని స్తున్నారని కొందరు వ్యక్తులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఇలా విగ్రహాల ఏర్పాటునకు తాము ఎంత మాత్రం అనుమతినివ్వబోమని తెలిపింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ భూముల్లో ఎటువంటి తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా, విగ్రహాలను ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.