సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి మండలం ఆగాపురలోని ఓ ప్రైవేటు ఆస్తి విషయంలో రెవెన్యూ అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రైవేటు ఆస్తి అని చెబుతున్న దానికి సంబంధించి టౌన్ సర్వే ల్యాండ్ రికార్డుల్లో (టీఎస్‌ఎల్‌ఆర్)లో ‘జీ ’అని ఉందని, జీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రభుత్వం వాదించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ‘‘రేపు మీరు నా ఇంటి విషయంలో కూడా రికార్డుల్లో జీ అని రాసేస్తే, నేను నా ఇంటిపై యాజమాన్య హక్కులను నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా?’’అని నిలదీసింది.
ఆ ఆస్తి మీది(ప్రభుత్వం) అని భావిస్తే సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాలంది. 4 నెలల్లో సివిల్ కోర్టును ఆశ్రయించకుంటే, ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆగాపురలో కమల్‌కిషోర్ అగ ర్వాల్ అనే వ్యక్తికి చెందిన 558.5, 870 చదరపు గజాల స్థలాన్ని అధికారులు టీఎస్‌ఎల్‌ఆర్‌లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. దీనిప్రకారం కిషోర్‌ను భూ ఆక్రమణదారుగా పేర్కొంటూ, ఆ భూమిని ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై కమల్‌కిషోర్ 2011లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగి ల్ జడ్జి ప్రభుత్వ నోటీసులను రద్దు చేశారు.
దీనిపై రెవెన్యూ అధికారులు గతేడాది ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం రెవెన్యూ శాఖ న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని సివిల్ కోర్టుకెళ్లి తేల్చుకోవాలనడం సరికాదన్న వాదననూ తోసిపుచ్చింది. 4 నెలల్లో సివిల్ కోర్టుకెళ్లాలని, లేనిపక్షంలో సింగిల్ జడ్జి తీర్పు అమల్లోకి వస్తుందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment