
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆట బాలోత్సవ్’కార్యక్రమ బ్రోచర్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఆవిష్కరించారు. పిల్లలకు చదువుతో పాటు వివిధ కళల పట్ల అవగాహన కల్పించడానికి బాలోత్సవ్ ఉత్సవాలు ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు.
ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు, కళాకారులు పాల్గొంటున్నట్లు ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 10, 11 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందజేస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.