బంద్ సక్సెస్ | bandh success | Sakshi
Sakshi News home page

బంద్ సక్సెస్

Published Thu, Jun 26 2014 5:04 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

బంద్ సక్సెస్ - Sakshi

బంద్ సక్సెస్

- ముంపు మండలాల్లో నిలిచిన ఆర్టీసీ బస్సులు
- మూతపడిన దుకాణాలు
- ‘పోలవరం’ డిజైన్ మార్చాలని అఖిలపక్షం డిమాండ్
- 30న విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

 భద్రాచలం : గిరిజనులను నీటముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన ముంపు మండలాల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అఖిల పక్షం, వివిధ ప్రజా సంఘాలు, పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. విధులు బహిష్కరించి బయటకు రావాలని ఐటీడీఏ కార్యాలయ ఉద్యోగులను కోరారు.

బంద్ విజయవంతం  చేయాలని కోరుతూ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట టైర్లు కాల్చి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత  పోలీసులు వచ్చి ఆందోళన కారులతో చర్చించి, వాహనాలు ముందుకుపోయేలా ఏర్పాటు చేశారు. కాగా, భద్రాచలం బస్టాండ్ నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ బస్సులు కదల్లేదు. ఖమ్మం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా సార పాక నుంచే వెనక్కు మళ్లించారు.
 
గిరిజనుల మనోభావాలను దెబ్బతీయొద్దు..
గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పోలవరం ముంపు ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ముంపు మండలాల బంద్‌లో భాగంగా భద్రాచలంలో పార్టీ నాయకులతో కలసి ఆయన జాతీయ రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కార్పొరేట్ శక్తుల లబ్ధి కోసం లక్షలాది మంది గిరిజనులను నీట ముంచటం అన్యాయమన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని, అయితే డిజైన్ మార్చి నష్టాన్ని నివారించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకపోవడం దారుణమని విమర్శించారు. డిజైన్ మార్పు చేసి ఎత్తు తగ్గిస్తే ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావటంపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరారు.  
 
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం...
ముంపు మండలాను రక్షించుకునేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ క న్వీనర్ వట్టం నారాయణ దొర, గుండు శరత్‌బాబు అన్నారు. గురువారం భద్రాచలం వచ్చే ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కలసి దీని పై వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 30న ముంపు మండలాల్లో విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఆందోళన కార్యక్రమాల్లో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు పూసం రవికుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, సీపీఎం రాష్ట్ర కమి టీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం జడ్పీటీసీ అన్నెం సత్యాలు, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రంగారా వు, కెచ్చెల కల్పన, ఎంబీ నర్సారెడ్డి, ఏవీ రావు, పడిసరి శ్రీనివాస్, మడవి నెహ్రూ, జగదీష్, నవీన్, మహేష్, వెంకటరెడ్డి,   శేఖర్,జేఏసీ నాయకులు సోమశేఖర్, సోడె చలపతి, సాయిబాబా పాల్గొన్నారు.
 
సీమాంధ్ర సభ్యుల దిష్టిబొమ్మ దహనం...
సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో సీమాంధ్ర ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఏవూరి వెంకటేశ్వరరావు, రాజు, నాయుడు, గంగాధర్, సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement