బ్యాంకర్ల తీరు సరిగా లేదు: కేసీఆర్ | Bankers way not in properly, says KCR | Sakshi
Sakshi News home page

బ్యాంకర్ల తీరు సరిగా లేదు: కేసీఆర్

Published Wed, Nov 12 2014 1:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

బ్యాంకర్ల తీరు సరిగా లేదు: కేసీఆర్ - Sakshi

బ్యాంకర్ల తీరు సరిగా లేదు: కేసీఆర్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్య  
బ్యాంకులు వారికి నచ్చితేనే రుణాలిస్తున్నాయి
స్వయం ఉపాధికి మోడల్ పథకాన్ని రూపొందిస్తాం
దీనిపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం తీసుకుంటాం
ఏకాభిప్రాయంతో మార్గదర్శకాలు రూపొందిద్దామన్న సీఎం

 
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాల అమల్లో బ్యాంకర్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్ల తీరు సరిగా లేదని, ఏవేవో సాకులు చెప్పి రుణాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల్లో బ్యాంకర్ల ప్రత్యక్ష ప్రమేయం వల్ల వాళ్లకు నచ్చితేనే రుణాలిస్తున్నాయని పేర్కొన్నారు.
 
 మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ఇటీవల భూమి కొనుగోలు పథకంపై చర్చ జరిగినప్పుడు అందులో బ్యాంకర్ల పాత్ర ఉండాలని అధికారులు చెబితే.. తాను వద్దే వద్దంటూ కొట్లాడినంత పని చేసినట్లు చెప్పారు. బ్యాంకులతో పెట్టుకుంటే అది అయ్యేది కాదని.. ప్రభుత్వ డబ్బుతోనే భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ‘‘దళిత నిరుద్యోగ యువతకు సరైన న్యాయం జరగటం లేదు.
 
  ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా.. ఏం చేయాలనే దానిపై అందరి సహకారం కోరుతున్నాం. ఈ వారంలోనే, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడే.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమై ఏకాభిప్రాయంతో నిర్ణ యం తీసుకుందాం. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. అందుకే ఆ పథకం ఏ విధంగా ఉండాలో అందరి అభిప్రాయాలు పంచుకుం దాం. రాష్ట్రంలో, కేంద్రంలో అన్నిచోట్లా గతంలో సబ్‌ప్లాన్ల నిధుల మళ్లింపు జరిగింది. మనం సబ్ ప్లాన్‌ను కచ్చితంగా అమలుచేద్దాం. ఎస్సీ వర్గాల నుంచి పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.కోటి ఇచ్చే ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వ వ్యూహంతో మేం ముందుకు వస్తాం. ఫ్లోర్ లీడర్లతో పాటు దళిత, గిరిజన, మైనారిటీ శాసనసభ్యులందరితో సమావేశమవుదాం. ఏది ఉత్తమమైన పాలసీ అనుకుంటే.. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేద్దాం’’ అని సీఎం వివరించారు.
 
 ఎంపిక కమిటీల నుంచి బ్యాంకర్లను తొలగించండి: జీవన్‌రెడ్డి
 కరీంనగర్ జిల్లాలో 2013-14 సంవత్సరానికి సంబంధించి దళితులు, గిరిజనులు, మైనారిటీలకు లబ్ధి చేకూర్చేందుకు మంజూరైన స్వయం ఉపాధి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.  నిర్ణీత కాలవ్యవధిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. బ్యాంకర్లను లబ్ధిదారుల ఎంపిక కమిటీల నుంచి తొలగించాలని, రికవరీ గురించి ఆలోచిస్తే అర్హులైన నిరుపేద యువత లబ్ధిపొందే అవకాశం కోల్పోతారని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రి ఈటెల  సమాధానమిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. బ్యాంకర్లు సహకరించటం లేదు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆలోచిస్తోంది..’’ అని చెప్పారు.
 
 తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చండి
 ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు మార్చాలని రైల్వే మంత్రికి కేసీఆర్ లేఖ!
 హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు పేరును తెలంగాణ స్టేట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్ర రైల్వేమంత్రికి లేఖ రాయనున్నారు. ప్రస్తుతం ఆ రైలును ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు నెలలైనా.. ఇంకా ఆ రైలు పేరును మార్చకపోవడం సరికాదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నారు.  తెలంగాణ స్టేట్ పేరుతో మారిస్తే   రాష్ట్రానికి ఒక గుర్తింపు కూడా లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.   
 
 బీసీ బోర్డుల పనితీరును సమీక్షిస్తాం
 బీసీ కులాల సంక్షేమం కోసం గతంలో ఏర్పా టు చేసిన బోర్డుల కొనసాగింపు విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. వాటి పనితీరును సమీక్షించి అసలు వాటి అవసరం ఎంతో తేల్చాల్సి ఉందన్నారు. ఇలాంటి బోర్డులకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోతుండటంతో.. ఎందుకూ కొరగాకుండా పోతున్నాయని, వాటి తాలూకు కార్యాలయాల్లో ఫర్నిచర్ కూడా ఉండటం లేదని మంగళవారం అసెంబ్లీలో బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందించారు. ‘‘ఈ బోర్డులను అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారో ఆ భగవంతుడికే తెలియాలి.
 
 వాటి పనితీరు కూడా అంతుబట్టడం లేదు. వెంటనే వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే.. వీలైతే ఈ సమావేశాల సమయంలోనే అన్ని పక్షాలతో కలసి సమీక్షిస్తాం. అందులో వచ్చిన సూచనల ఆధారంగా వాటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుంది. వచ్చే సంవత్సరం బడ్జెట్‌కు పెద్దగా సమయం కూడా లేదు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చే కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటుంది’’ అని  చెప్పారు. బీసీలకు తాజా బడ్జెట్‌లో కేటాయిం చిన రూ.2 వేల కోట్లు ఎందుకూ సరిపోవని, బీసీసంఘాలు రూ.20 వేల కోట్లు కోరితే ప్రభుత్వం అంత తక్కువగా ఇవ్వటం సముచితం కాదని లక్ష్మణ్ పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని బీసీలతోపాటు అగ్రవర్ణాల పేదలకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement