సీఎం చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి పథకాలను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం నేరుగా అందించాలని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణేష్ గుప్తా, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల వారీగా లబ్ధిదారులు
‘‘బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుక్కోవడానికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అవసరమైన పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇందుకు గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలి. లబ్ధిదారుల జాబితా సిద్ధం కాగానే బ్యాంకులతో సంబంధం లేకుండా వారికే నేరుగా ఆర్థిక సాయం అందించాలి’’అని సీఎం చెప్పారు. ‘‘బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకు వినియోగించాలి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
పెద్దఎత్తున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్స్‌లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని కూడా బీసీలకే కేటాయిస్తాం. బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కల్లు దుకాణాల పునరుద్ధరణ, చెట్ల పన్ను రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతోంది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చే విషయాలపై మరోసారి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’అని సీఎం వివరించారు.
పండ్లు, కూరగాయాలు అమ్ముకునేవారికీ చేయూత
యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులు తదితరులు లాభం పొందుతున్నారన్నారు. చేనేతను ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని పేర్కొన్నారు. ఇంకా చాలా కులాలవారు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ చేయూత అందిస్తామని చెప్పారు. ‘‘విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలి. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారులు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలి’’అని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment