- విధులు బహిష్కరించిన న్యాయవాదులు
- బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన
పరిగి: హైకోర్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విధులు బహిష్కరించి పరిగి కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రం చట్టబద్ధంగా విడిపోయినా హైకోర్టును మాత్రం ఉమ్మడిగా కొనసాగించడం సమంజసం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రస్తుత హైకోర్టును తెలంగాణకు కేటాయించి ఆంధ్రా సర్కారుకు మరో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బ్రహ్మం, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, బాలముకుందం, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, అందె విజయ్‌కుమార్, రాముయాదవ్, నర్సింహులు, రాంచందర్, ఇబ్రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో జరుగుతున్న ధర్నాకు తరలివెళ్లారు.