వెల్‌కమ్ ఒబామా
అమెరికా అధ్యక్షుడికి తెలంగాణ సర్కారు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలంగాణను సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. వచ్చే నెలలో భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వస్తున్న ఒబామాను హైదరాబాద్‌కు కూడా ఆహ్వానించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసినట్లు ప్రభుత్వవర్గాలు వివరించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశ సందర్శన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చే అంశంపై ఇదివరకే తమ మంత్రి తారక రామారావు అమెరికా ఎంబసీతో మాట్లాడిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన లేఖలో ప్రస్తావించినట్లు ఆ వర్గాలు వివరించాయి. కాగా మంగళవారం సచివాలయంలో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ (పొలిటికల్, మిలటరీ) పునీత్ తల్వార్‌తోపాటు వచ్చిన ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు, అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.