సాక్షి,సిటీబ్యూరో: మటన్ రుచి కోసం అర్రులు చాస్తున్నారా... మటన్‌కర్రీ.. బిర్యానీ.. పత్తర్‌కా ఘోష్ వంటి మటన్ వంటకాలను బాగా ఇష్టపడుతున్నారా.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..అపరిశుభ్ర పరిసరాలతో అలరారుతోన్న మాంసం దుకాణాల్లో మటన్ కొనుగోలు చేస్తే మీకు అనారోగ్యం తథ్యమంటున్నారు వైద్యనిపుణులు. ప్రధానంగా హైదరాబాద్ నగరంతోపాటు దేశరాజధాని ఢిల్లీలో బహిరంగ మార్కెట్లు, మాంసం దుకాణాలు, స్లాటర్‌హౌస్‌లలో విక్రయిస్తున్న మటన్‌లో మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే సూక్ష్మజీవుల ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు జాతీయ మాంసం పరిశోధన కేంద్రం తాజా పరిశోధనలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జూనోటిక్ వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మటన్‌లో 5 నుంచి 8 శాతం ఈ రెండు నగరాల్లో విక్రయిస్తున్న మాంసంలో ఉన్నట్లు తేలడం గమనార్హం.
అపరిశుభ్రం మాంసంలో రోగకారకాలు..
ప్రధానంగా బహిరంగ మార్కెట్లలో అపరిశుభ్ర పరిసరాల్లో విక్రయిస్తున్న మాంసంలో బ్రూసిల్లోసిస్, లెప్టోస్పైరోసిస్ వంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇందులో ఐదు శాతం బ్రూసిల్లోసిస్, మరో 7–8 శాతం లెప్టోస్పైరోసిస్ సూక్ష్మజీవుల ఆనవాళ్లున్నట్లు బయటపడింది. ఈ సూక్ష్మజీవులు మాంసం విక్రయదారులు, వినియోగదారుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడంతోపాటు పలు జీర్ణకోశవ్యాధులు, జ్వరం తదితర విపరిణామాలకు దారితీస్తున్నట్లు తెలిసింది. ఇటీవల గ్రేటర్‌హైదరాబాద్‌తోపాటు దేశరాజధాని ఢిల్లీలో 150 మంది మాంసం వ్యాపారుల రక్తనమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయం వెలుగు చూసింది. ప్రధానంగా ఎలుకలు, పిల్లులు అ«ధికంగా సంచరించే మాంసం దుకాణాలు, వాటి మలమూత్రాలు విసర్జించే ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో ఈ సూక్ష్మజీవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. మాంసం విక్రయించే వారు చేతికి గ్లౌజులు, వస్త్రాలపై ధరించే ఆప్రాన్‌లు లేకుండా మాంసాన్ని తాకుతుండడంతో కూడా ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు తేలింది.
అరకొరగా తనిఖీలు
ప్రధానంగా మహానగరం పరిధిలోని మాంసం దుకాణాలపై తనిఖీలు నామమాత్రమవుతున్నాయి. ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్‌ఇండియా నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నవారే అత్యధికంగా ఉన్నారు. ఆరుబయట నేలపైనే, అపరిశుభ్ర పరిస్థితులున్నచోటనే జంతువులను వధించడంతో ఇన్‌ఫెక్షన్లు మాంసంలోకి ప్రవేశిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అపరిశుభ్ర దుస్తులను ధరిస్తున్న వ్యాపారుల నుంచి కూడా ఇవి వ్యాప్తిచెందుతున్నాయి. చేతివేళ్లకు గాయాలున్నవారు, ఇతర ఇన్‌ఫెక్షన్లున్న వ్యాపారుల నుంచి మాంసంలోకి ఆ తరువాత వినియోగదారులకు ఈ సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతుండడంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 బడా స్లాటర్‌హౌస్‌లు, మరో 3354 మాంసం దుకాణాలున్నాయి. ఇందులో ఇప్పటికే అపరిశుభ్ర పరిస్థితులున్నట్లు గుర్తించి 1518 దుకాణాల యజమానులపై ఇటీవల రూ.1.43 లక్షల జరిమానా విధించినట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దుకాణాల నుంచి 2708 కిలోల మటన్, 10,218 కిలోల బీఫ్‌ను స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదుచేసినట్లు బల్దియా అధికారులు పేర్కొన్నారు.
అవగాహనే కీలకం..
మాంసం వ్యాపారులు,వినియోగదారులు ఈవిషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసం విక్రయించే బహిరంగ మార్కెట్లు, స్లాటర్‌హౌస్‌లు, దుకాణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సూక్ష్మజీవరాహిత్యంగా ఉంచాలని...గొర్రెలు, మేకలను పూర్తి పరిశుభ్ర పరిస్థితుల్లోనే వధించాలని సూచిస్తున్నారు. విక్రయించే వ్యాపారులు సైతం చేతికి గ్లౌజులు, ఆప్రాన్‌లు ధరించాలని..దుకాణాల్లో ఎలుకలు, పిల్లులు ఇతర పెంపుడు జంతువుల సంచారం, వాటి మలమూత్రాధులు లేకుండా చూడాలని స్పష్టం చేస్తున్నారు. ఇక వినియోగదారులు సైతం మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తరవాతనే ఆరగించాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment