బెట్టింగ్.. బెట్టింగ్... | betting on general election results | Sakshi
Sakshi News home page

బెట్టింగ్.. బెట్టింగ్...

Published Thu, May 15 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

బెట్టింగ్.. బెట్టింగ్...

బెట్టింగ్.. బెట్టింగ్...

అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలపై జిల్లాలో ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ ఇది. ఇదే అంశాలపై భారీగా పందేలు కూడా సాగుతున్నాయి. మూడురోజుల క్రితం వరకూ లక్షల రూపాయలలో నడిచిన బెట్టింగ్ ప్రస్తుతం కోట్లకు చేరింది. జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాలు, సీమాంధ్ర ఫలితాలపై కూడా బెట్టింగులు నడుస్తున్నాయి.

 మున్సిపల్, పరిషత్ ఫలితాలు వెల్లడికావడంతో ఇప్పుడు అందరి దృష్టీ సార్వత్రికం పైనే ఉంది. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఫలితాలపై ఎంతవరకూ చూపుతుందీ అన్నదానిపై అన్ని రాజకీయపార్టీల నేతలు, విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.   పల్లెలు, పట్టణాల వారీగా విశ్లేషిస్తూ  గెలుపు ఎవరిది అనేది కొందరు లెక్కలు తీస్తుండగా, ఈ ఫలితాలను సార్వత్రిక ఫలితాలతో ముడిపెట్టలేమనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఇలా ఏపార్టీ ఎలా లెక్కలు వేసుకున్నా మరో 24 గంటల తర్వాత సార్వత్రిక ఫలితాలు వెలువడనుండడంతో జిల్లా వ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో పందెంరాయుళ్లు తమపనిలో తామున్నారు. వరుసగా వచ్చిన ఫలితాలు, జరుగుతున్న చర్చలతో జిల్లాలో బెట్టింగులు సైతం జోరందుకున్నాయి. జిల్లాలో అభ్యర్థుల విజయం, తెలంగాణ రాష్ట్రంలో...,సీమాంధ్రలో పార్టీల విజయావకాశాలపై పలువిధాలుగా పందేలు జరుగుతున్నాయి.

 రూ.లక్షల నుంచి రూ.కోట్లకు..
 పోలింగ్ ముగిసిన వెంటనే... జిల్లాలో ప్రధానంగా ఓ పార్టీ అభ్యర్థికి మెజారిటీ లక్ష దాటుతుందని, ఇతనికి ప్రత్యర్థి, మరో ప్రధాన పార్టీ అభ్యర్థి గెలవడని.. రూ.లక్షల్లో బెట్టింగ్ పెట్టారు. ఫలితాల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ బెట్టింగ్ మరింతగా పెరుగుతోంది. ఈ అభ్యర్థి మెజారిటీపై సరిహద్దు జిల్లాల్లో కూడా భారీఎత్తున పందేలు నడుస్తున్నట్లు చర్చజరుగుతోంది. అంతే కాకుండా సీమాంధ్రలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనేదానిపై   సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, మధిరలో   భారీగా పందేలు నడుస్తున్నాయి. రెండురాష్ట్రాలలో కీలక స్థానాలలో అభ్యర్థుల విజయం, మెజారిటీపై కూడా పందాలు జరుగుతున్నాయి.

 ఇతర జిల్లాల  వారు కూడా....
 జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై పొరుగు జిల్లాలకు చెందినవారూ దృష్టిపెట్టారు. ముఖ్యంగా సరిహద్దున ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం,  ఏలూరు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కృష్ణా జిల్లాలోని కైకలూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలు కాస్తున్నట్లు సమాచారం. గ్రూపులవారీగా ఈ పందాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.   ఒక్కో గ్రూపులో పది నుంచి 20 మంది వరకు సభ్యులుగా ఉండి రూ.కోటిపైగా బెట్టింగ్‌కు దిగుతున్నట్లు తెలిసింది. మొత్తంగా ఎప్పుడూ లేనంతగా ఈసారి జిల్లా ఫలితాలపై పందేలు భారీగా సాగుతుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement