చిరుతపులి ఉంది జాగ్రత్త!
బంధించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి మండలం కలివేముల, కాశీపూర్, చెర్లగూడెం, జూల్‌కల్ శివారుల్లో చిరుతపులి సంచరిస్తోందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు సూచించారు. శనివారం కలివేముల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ బొజ్జా ఫారెస్ట్ అధికారులతో సమావేశమై చిరుతపులి సంచరిస్తున్న విషయంపై ఆరా తీశారు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ కలివేముల శివారులో చిరుత పాద ముద్రలను గుర్తించి వాటి ఫొటోలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు తె లిపారు.
డబ్బు చప్పుళ్లకు చిరుతపులి పారిపోయే అవకాశం ఉందని అందుకు గానూ గ్రామాల్లో డబ్బుచాటింపు వేయించాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లకు సూచించారు. చిరుత పులిని పట్టుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాత్రివేళల్లో గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. పులి సంచరిస్తున్న ఛాయలు ఎక్కడైన కనబడితే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలపాలని ప్రజలను కోరారు. చర్లపల్లి శివారుల్లో చిరుతను బంధించడానికి బోన్లను ఏర్పాటు చేసినట్లు ఫారెస్టాఫీసర్ అనురాధ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఆ ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు.