సాక్షి,సిటీబ్యూరో: అరుదైన శస్త్ర చికిత్సలు, ఆధునిక వైద్యానికి చిరునామాగా మారుతోన్న హైటెక్ నగరాన్ని ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తున్నాయి. వాడేసిన సిరంజీ.. పడేసిన కాటన్.. ఖాళీ టానిక్ సీసా.. మెడికల్ గ్లౌజులు ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు సిటీని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లు స్వేచ్ఛగా వాతావరణంలో కలిసి నగర ప్రజలను రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఆస్పత్రి వ్యర్థాలను ఆరుబయట తగులబెడుతుండడంతో ఏటా 20 శాతం మంది అంటువ్యాధుల బారిన పడుతున్నట్టు నిపుణులు తేల్చారు. గ్రేటర్‌లో నిత్యం 50 టన్నుల మేర జీవవ్యర్థాలు ఉత్పన్నమవుతుండగా, అందులో సుమారు 20 టన్నుల వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల నిర్వాహకులు నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. అక్కడే వాటిని తగులబెడుతున్నారు. దీంతో నగర పర్యావరణాన్ని తీవ్రస్థాయిలో కలుషితం చేస్తున్న నేపథ్యంలో నిబంధనలను పాటించని ఆస్పత్రులపై కొరడా ఝళిపిస్తామని పీసీబీ హెచ్చరించింది.
వ్యర్థాలు ‘బహిరంగ’ రహస్యం
అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 3,919 ప్రభుత్వ, ప్రైవేటుఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల జీవ వ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ అంచనా వేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, నగరానికి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల నుంచి మరో 15 టన్నుల ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు లెక్కగట్టింది. వీటిలో సుమారు 20 టన్నుల వ్యర్థాలను పలు చిన్నా పెద్దా ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతోపాటే పడవేస్తున్నారు. దీంతో బ్యాక్టీరియా, వైరస్ గాలిలో కలిసి పలు రకాల అంటువ్యాధులకు కారణమవుతున్నాయి. పలు నర్సింగ్‌హోమ్‌ల నిర్వాహకులు సాధారణ చెత్తను సేకరించే వారికే ఎంతో కొంత గనదు ముట్టజెప్పి జీవవ్యర్థాలను తరలిస్తున్నట్టు సమాచారం. ఎక్కడ బయో వేస్ట్ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనని కొన్ని ఆస్పత్రులు బెడ్లను సైతం తక్కువ చేసి చూపుతున్నట్లు తెలిసింది.
కాగితాల్లో మగ్గుతున్న చట్టం..
ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీగా వెలువడుతున్న చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీ సైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి. రవాణా సమయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, నాలాల్లో ఈ వ్యర్థాలను పడవేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులు అంటురోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఆస్పత్రి వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపే విషయంలోనూ పలు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఆస్పత్రులపై ‘పీసీబీ’ నజర్
జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించని ఆస్పత్రులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమైంది. ఆలాంటి వాటిని మూసివేసేందుకు వెనుకాడబోమని పీసీబీ సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి యాజమాన్యం పీసీబీ నుంచి ‘కన్సెంట్ ఫర్ ఆపరేషన్’(సీఎఫ్‌ఓ)అనుమతి పొందాలని, రెండునెలల్లోగా మురుగునీటి శుద్ధి ప్లాంటు(ఎస్‌టీపీ)నిర్మించుకుని వినియోగంలోకి తీసుకు రావాలని ఆదేశించారు. రెండు నెలల్లోగా ఈ పనులు పూర్తిచేయని ఆస్పత్రులను ప్రాసిక్యూషన్ చేయడంతో పాటు మూసివేస్తామని హెచ్చరించారు. ఇటీవల నిబంధనలు పాటించని పది ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీచే శామని తెలిపారు.
నిబంధనలకు పాతర ఇలా..
♦ ఆస్పత్రులు విధిగా తమకు అందుబాటులో ఉన్న బెడ్లకు బయోవ్యర్థాల సెస్‌ను చెల్లించడం లేదు. బెడ్ల లెక్కలను తక్కువ చేసి చూపుతున్నాయి.
♦ ఆస్పత్రి వ్యర్థాలు సేకరించేందుకు ప్రాంతాల వారీగా ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఏజెన్సీల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొంది.
♦ వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపే విషయంలో ఏజెన్సీలు సూచించిన పద్ధతిలో ఆస్పత్రులు నడుచుకోవడంలేదు.
♦ ఆస్పత్రి వ్యర్థాలను తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
♦ ఒక్కో ఏజెన్సీకి పదివేల బెడ్ల నుంచి ఆస్పత్రి వ్యర్థాలను సేకరించేందుకు అనుమతివ్వాలి.
ఆస్పత్రి వ్యర్థాలతో అనర్థాలివే..
హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడ్లు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆ రోగం సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్–బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను బయటే పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు సోకుతున్నాయి.
నిత్యం గ్రేటర్‌లో వ్యర్థాల ఉత్పత్తి ఇలా..
♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు: 3,919
♦ రోజువారీగా వెలువడుతున్న బయోమెడికల్ వేస్ట్: 50 టన్నులు
♦ నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నజీవ వ్యర్థాలు: 20 టన్నులు
రంగు డబ్బాలతో సత్ఫలితం
పసుపు రంగు డబ్బా: మానవ, జంతు, శరీర అవయవాలు, రక్తంతో కూడిన భాగాలు, ప్రయోగశాలల వ్యర్థాలు
నిల్వ చేయాలి.
ఎరుపు డబ్బా: రక్తంతో తడిసిన సామగ్రి, కాటన్, డ్రెస్సింగ్ మెటీరియల్, ప్లాస్టర్లు, సిరంజిలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయాలి.
నలుపు డబ్బా: కాలం చెల్లిన మందులు, సూదులు, బ్లేడ్లు, ఇతర పదునైన వస్తువులు వేయాలి.
నేరేడు రంగు డబ్బా: కేన్సర్‌కు వాడే మందులు, సంబంధిత వ్యర్థాలు వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment