bio wastage
-
ఆదిలాబాద్ లో కరోనా రోగులకు వాడిన బయో వ్యర్ధాల కలకలం
-
కోవిడ్ వ్యర్థాలివే...
సాక్షి,సిటీబ్యూరో: కోవిడ్ వ్యర్థాలు వంద టన్నులు దాటాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న తరహాలోనే కోవిడ్ మహమ్మారి సోకిన రోగులు వాడిపడేసిన జీవ వ్యర్థాలు సైతం దడపుట్టిస్తున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా రోజుకు సుమారు ఒక టన్నుకు పైగానే ఈ వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్ కేంద్రాలు, 7 నమూనా సేకరణ కేంద్రాలు, 10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ సెంటర్లకు తరలించి పర్యావరణానికి హాని కలగని రీతిలో నిర్వీర్యం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం గమనార్హం. కోవిడ్ పంజా విసిరిన మార్చి 29 నుంచి జూన్ 22 వరకు సుమారు 100 టన్నుల వ్యర్థాలను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచి 50 టన్నుల జీవ వ్యర్థాలను సేకరించామన్నారు. కోవిడ్ వ్యర్థాలివే... కోవిడ్ సోకిన రోగులకు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో వాడిన మాస్క్‌లు, గ్లౌస్లు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజిలు, కాటన్, పర్సనల్ ప్రోటెక్షన్ ఎక్విప్మెంట్(పీపీఈ)కిట్లు, మెడిసిన్స్ కవర్స్ తదితరాలను కోవిడ్ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యర్థాల పరిమాణం రోజురోజుకూ పెరుగుతూనే ఉండడం గమనార్హం. వీటిని నిర్లక్ష్యంగా ఇతర జీవ వ్యర్థాలతోపాటే పడవేస్తే వ్యాధి విజంభించే ప్రమాదం పొంచి ఉండడంతో పీసీబీ వర్గాలు,శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి జాగ్రత్తగా శుద్ధి కేంద్రాలకు తరలిస్తుండడం విశేషం. వ్యర్థాల శుద్ధి అంతా ప్రత్యేకం.. కోవిడ్ సోకిన రోగులతోపాటు వారు వాడి పడేసిన వ్యర్థాలను సైతం అంతే జాగ్రత్తగా శుద్ధి చేస్తున్నారు. ప్రధానంగా జీవ వ్యర్థాలను శుద్ధి చేసే కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాలు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. 55 ప్రత్యేక వాహనాల ద్వారా ఈ కేంద్రాలకు నిత్యం కోవిడ్ వ్యర్థాలు చేరుతున్నాయి. వీటిని రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. ఆ తర్వాత ఈ బూడిదను దుండిగల్‌లోని హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రానికి తరలించి అక్కడ బూడిదను మళ్లీ వివిధ రసాయనాలతో శుద్ధిచేసి ప్రత్యేక బాక్సుల్లో నిల్వచేసి భూమిలో అత్యంత లోతున పూడ్చివేస్తున్నారు. పలువురిపై కోవిడ్ పంజా.. కోవిడ్ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో సుమారు 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వ్యర్థాల తరలింపు, శుద్ధిచేస్తున్న సుమారు 25 మందికి కోవిడ్ సోకినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్నందున తమకు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి అందజేస్తున్న బీమా, ఇతర వసతులు కల్పించాలని ఆయా సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
వ్యవసాయ వ్యర్థాలతో బయో బ్రిక్స్
సాక్షి, సంగారెడ్డి: వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు బయో ఇటుకలు తయారు చేశారు. ఇవి పర్యావరణహితంగా, తక్కువ ఖర్చులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ డిజైన్ డిపార్ట్మెంట్ పీహెచ్డీ స్కాలర్ ఆర్.ప్రియాబ్రతా రౌత్రే, కేఐఐటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్.అవిక్‌రాయ్ బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. ఐఐటీ డిజైన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ, అ్రస్టేలియా స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ బోరిస్ ఐసెన్‌బార్ట్ మార్గ నిర్దేశకంలో ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సదస్సులో నెదర్లాండ్‌లోని టీయూ డేల్ప్ వద్ద (ఐసీఈడీ–1019) ప్రదర్శించారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకలను అభివృద్ధి చేసే ప్రయోగం గత కొంతకాలంగా జరుగుతోందని ఆర్.ప్రియాబ్రతా రౌత్రే చెప్పారు. మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బయో ఇటుకల తయారీకి 1990లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భారత్‌లో ఏటా 500 మిలియన్ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రియాబ్రతా తెలిపారు. ఈ వ్యర్థాల్లో కొంత పశుగ్రాసంగా వాడుతున్నారని, దాదాపు 84 నుంచి 141 మిలియన్ టన్ను లు బుడిద అవుతోందని, దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని వివరించారు. ప్రొఫెసర్ అవిక్‌రాయ్ మాట్లాడుతూ.. బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. కాలిన మట్టి ఇటుకల్లా ఇవి బలంగా ఉండకపోయినా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగించలేమని తెలిపారు. చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. భవనాల్లో తేమను నిరోధిస్తాయని చెప్పారు. మరింత మెరుగైన వాటిని తయారు చేసేందుకు ఇంకా పరిశోధనలు చేస్తామని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ఇటీవల నిర్వహించిన గ్రామీణ ఇన్నొవేటర్స్ స్టార్ట్ ఆఫ్ కాన్క్లేవ్లో స్థిరమైన హౌజింగ్ కోసం ఈ బయో బ్రిక్ ప్రత్యేక గుర్తింపు ట్రోఫీని అందుకుందని చెప్పారు. ‘వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్ ప్లాంట్ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తాం. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది.’ – ప్రియాబ్రతా రౌత్రే -
బయోమెడికల్ వ్యర్థాలు..ప్రాణాంతక వ్యాధులు
మనం ఏదైనా ఆసుపత్రికి వెళితే వైద్యులు వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకుని రమ్మంటారు.. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్ వేస్తారు.. వీటి కోసం వినియోగించిన సిరంజిలను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రాణాంతకం. వాటిని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ఇవ్వాలి. కొందరు వైద్యులు కక్కుర్తి పడి ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులకు వ్యర్థాలు ఇవ్వడం లేదు. రోడ్లపై, చెత్త కుండీల్లో పడేస్తున్నారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఈ వ్యర్థాలను ఇస్తుండటంతో పెను ప్రమాదం పొంచి ఉందంటున్నారు పర్యావరణ వేత్తలు. జిల్లాలో 200కు పైగా చిన్న, పెద్ద ఆసుపత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ప్రొద్దుటూరు టౌన్ : మనుషులకు, జంతువులకు రోగనిర్ధారణ కోసం ఉపయోగించిన సింరజిలు, సెలైన్ బాటిళ్లు, రక్తపు బ్యాగ్‌లు, కట్టు గుడ్డలు, శరీరంలోని వివిధ రకాల అవయవాలు ఇవన్నీ బయో మెడికల్ వ్యర్థాలుగా పరిగణించారు. అనంతపురం జిల్లాలో ఉన్న శ్రవన్ ఎన్విరాన్మెంట్æటెక్నాలజీస్ అనే బయో మెడికల్ వ్యర్థ రహిత ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ఈ వ్యర్థాలను ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. అనంతపురం జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని ఆసుపత్రుల నుంచి వచ్చే బయో మెడికల్ వ్యర్థాలను ఈ సంస్థకు చెందిన వాహనాల్లో ప్రతి రోజు తీసుకెళుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో 550కిపైగా ఆసుపత్రులు, రక్తపరీక్ష ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో 340 ఆసుపత్రులు, ల్యాబ్‌ల నుంచి వ్యర్థాలను ఈ ప్లాంట్ ప్రతినిధులకు ఇస్తున్నారు. మరో 200 ఆసుపత్రులు, ల్యాబ్‌లు వ్యర్థాలను వీరికి ఇవ్వకుండా రోడ్లపై, చెత్త కుండీల్లో, మున్సిపల్ చెత్త వాహనాల్లో వేస్తున్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్స్... జిల్లాలోని రాజంపేట మున్సిపాలిటీలో 14, రాయచోటిలో 10, లక్కిరెడ్డిపల్లెలో ప్రభుత్వాసుపత్రి, వేంపల్లి 3, పులివెందుల 16, జమ్మలమడుగు 15, మైదుకూరు 5, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రితో పాటు మరో 110 ప్రైవేటు ఆసుపత్రులు, కడప కార్పొరేషన్ 140, బద్వేలు 20, కోడూరు 10 ఆసుపత్రులు, ల్యా బ్లు బయోమెడికల్ వ్యర్థాలను ట్రీట్మెంట్ప్లాం ట్‌కు ఇస్తున్నాయి. ఇవి కాక మరో 200లకు పైగా ఆసుపత్రులు, ల్యాబ్‌లు బయో మెడికల్ వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. అలాగే జిల్లాలోని మరో 60 పీహెచ్‌సీల వ్యర్థాలను కూడా ట్రీట్ మెంట్ప్లాంట్కు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డీఎంఅండ్ హెచ్ఓకు లేఖలు ఇచ్చారు. కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు బయోమెడికల్ వ్యర్థాలను నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు. ఈ నీటిలోని దోమ ల వల్ల కానీ, ఈ నీరు భూమిలోకి ఇంకడం వల్ల కానీ పెను ప్రమాదం ఏర్పడుతుందన్న విషయం తెలిసి కూడా ఏ శాఖ దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. కంపోస్టు యార్డులో వ్యాపిస్తున్న వైరస్... మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో బయో మెడికల్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది కంపోస్టు యార్డు కు తీసుకెళుతున్నారు. బయోమెడికల్ వ్యర్థాలపై ఉన్న వైరస్, చెత్తలో కలిసి మరింత పెరుగుతోంది. పారిశుద్ధ్య సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రుల నిర్వాహకులు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి బయో మెడికల్ వ్యర్థాలను వాహనాల్లో వేసుకునే సమయంలో సిరంజిలు చేతులకు, కాళ్లకు గుచ్చుకుంటున్నా పట్టించుకోవడం లేదు. వారికి తెలియకుండానే భయంకరమైన జబ్బుల బారినపడే ప్రమాదం ఉందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. కేవలం చెత్తను తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా పర్యవేక్షణ అధికారులు లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులను తనిఖీ చేసిన సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్.. కొద్ది రోజుల కిందట కడప, ప్రొద్దుటూరుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను కర్నూలు రీజియన్ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ జనార్ధన్ పరిశీలించారు. చాలా ఆసుపత్రుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించని విషయంపై వైద్యులను ప్రశ్నించారు. కొందరు బయో మెడికల్ వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు ఇవ్వడం లేదని చెప్పారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగానికి డబ్బులు ఇచ్చి, ట్రీట్‌మెంట్‌ప్లాంట్ వారికి డబ్బు ఇవ్వాలంటే భారంగా మారిందని చెప్పడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే కడపలోని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయగా ప్రొద్దుటూరులోని 10 ఆసుపత్రులకు మరో రెండు రోజుల్లో నోటీసులు రానున్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చెల్లించే ఫీజు ఇలా... ప్రతి రోజు జిల్లాకు బయోమెడికల్ వ్యర్థాలను తీసుకెళ్లేందుకు మూడు ప్రత్యేక వాహనాలు వస్తున్నాయి. ఒక్క ప్రొద్దుటూరు నుంచి అరటన్నుకుపైగా వ్యర్థాలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వ్యర్థాలను వేరు చేస్తే టన్నుకు పైగా రావాల్సి ఉంది. ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్వాహకులు ల్యాబ్‌కు రూ.600, డెంటల్ ఆసుపత్రి నుంచి రూ.500, ఆసుపత్రిలో 50 బెడ్లు ఉంటే రూ.5000, 100 బెడ్లు ఉంటే రూ.10వేలు, ఇలా రూ. 500 నుంచి ఫీజు తీసుకుంటున్నాయి. ఒక్క రోజు వాహనం ఏ కారణం చేతనైనా రాక పోతే మరుసటి రోజు రెండు రోజుల వ్యర్థాలను తీసుకెళుతున్నా ఆ రోజు ఫీజును ఆసుపత్రుల నిర్వాహకులు ఇవ్వడం లేదని ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రకాల డబ్బాల వినియోగం ఎక్కడ... నిబంధనల ప్రకారం ప్రతి ఆసుపత్రిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులు కలిగిన డబ్బాలను విని యోగించాలన్న నిబంధనలు ఆసుపత్రులు పక్కన పెట్టాయి. కనీసం డస్టు బిన్స్ కూడా లేని ఆసుపత్రులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవగాహన లేమితో... ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బయోమెడికల్ వ్యర్థాలపై అవగాహన లేకపోవడం వల్లకూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. కొందరు సిరంజిలు, సెలైన్ బాటిళ్లు, విక్రయానికి తీసుకెళుతుండగా, మరి కొందరు ఆపరేషన్‌కు వినియోగించిన వస్తువులు నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు. పసుపు రంగు డబ్బాలో.. శరీర అవయవ భాగాలు, డ్రైసింగ్, గాజ్, దూది, పట్టీలు ఈ డబ్బాలో వేయాలి మావి, ప్లాసెంటా, గర్భాశయం, అపెండిక్స్ కంతులు తదితరాలు వ్యాధి నిర్ధారణ కణజాల నమూనాలు(బయాస్పీ స్పెసిమెన్) ఆటోక్లేవ్ చేసిన తర్వాత బ్లడ్ బ్యాగులు ఆపరేషన్‌లో తొలగించిన అవయవాలు డ్రెస్సింగ్ ప్యాడ్లు, బ్యాండేజీలు, దూది స్వాబ్లు, శానిటరీ ప్యాడ్లు, రక్తం, చీముతో తడిచిన ఏదైనా దూదిబట్ట, గాజ్ వంటి వ్యర్థాలు సిమెంట్ పట్టీలు వ్యాధి నిర్ధారణ తరువాత మిగిలిన మానవ శరీర వ్యర్థాలు (చీము, రక్తము, మలము, మూత్రము, కంతుల ముక్కలు) సైటో టాక్సిక్, యాంటిబయోటిక్స్ వయర్స్, (సగం వాడిన, కాలం చెల్లినవి) తెలుపు డబ్బాలో... పదునైన వ్యర్థాలన్నింటినీ ఈ డబ్బాలో వేయాలి ఈ డబ్బాలో 10 శాతం సోడియం హైపో క్లోరైడ్ ద్రవం కలిపి ఉంచాలి ఇంజక్షన్లు సూదులు ఇంజక్షన్మందు ఉంటే పగిలిన వయల్స్ పగిలిన ఆంప్యూల్స్ సూక్ష్మదర్శినిలో వాడే పగిలిన స్లైడ్స్ ఆపరేషన్‌లో కుట్లు వేసేందుకు ఉపయోగించిన సూదులు షేవింగ్ బ్లేడులు శస్త్రచికిత్సలో ఉపయోగించే రెండంచుల పదునైన కత్తులు, పరికరాలు రోగితో సంబంధం కలిగిన గాయపరిచే పదునైన వస్తువులు నీలం రంగు డబ్బాలో.. రబ్బర్, ప్లాస్టిక్ వ్యర్థాలను ముక్కలుగా కత్తిరించి ఈ డబ్బాలో వేయాలి మూత్రాన్ని బయటకు తీసే క్యాథిటర్స్ రోగికి వాడిన ఇతర ప్లాస్టిక్ గొట్టాలు రైల్స్ ట్యూబులు ముక్కు విరిచిన ప్లాస్టిక్ సిరంజిలు మూత్రపు సంచులు ఐవి సెట్స్ చేతి గొడుగులు, గ్లౌజ్ ఆఫ్రాన్లు డయాలసిస్ సామగ్రి -
‘బయో’త్పాతం
సాక్షి,సిటీబ్యూరో: అరుదైన శస్త్ర చికిత్సలు, ఆధునిక వైద్యానికి చిరునామాగా మారుతోన్న హైటెక్ నగరాన్ని ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తున్నాయి. వాడేసిన సిరంజీ.. పడేసిన కాటన్.. ఖాళీ టానిక్ సీసా.. మెడికల్ గ్లౌజులు ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు సిటీని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు స్వేచ్ఛగా వాతావరణంలో కలిసి నగర ప్రజలను రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఆస్పత్రి వ్యర్థాలను ఆరుబయట తగులబెడుతుండడంతో ఏటా 20 శాతం మంది అంటువ్యాధుల బారిన పడుతున్నట్టు నిపుణులు తేల్చారు. గ్రేటర్లో నిత్యం 50 టన్నుల మేర జీవవ్యర్థాలు ఉత్పన్నమవుతుండగా, అందులో సుమారు 20 టన్నుల వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించకుండా పలు ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌ల నిర్వాహకులు నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. అక్కడే వాటిని తగులబెడుతున్నారు. దీంతో నగర పర్యావరణాన్ని తీవ్రస్థాయిలో కలుషితం చేస్తున్న నేపథ్యంలో నిబంధనలను పాటించని ఆస్పత్రులపై కొరడా ఝళిపిస్తామని పీసీబీ హెచ్చరించింది. వ్యర్థాలు ‘బహిరంగ’ రహస్యం అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 3,919 ప్రభుత్వ, ప్రైవేటుఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల జీవ వ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ అంచనా వేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, నగరానికి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల నుంచి మరో 15 టన్నుల ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు లెక్కగట్టింది. వీటిలో సుమారు 20 టన్నుల వ్యర్థాలను పలు చిన్నా పెద్దా ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతోపాటే పడవేస్తున్నారు. దీంతో బ్యాక్టీరియా, వైరస్ గాలిలో కలిసి పలు రకాల అంటువ్యాధులకు కారణమవుతున్నాయి. పలు నర్సింగ్‌హోమ్‌ల నిర్వాహకులు సాధారణ చెత్తను సేకరించే వారికే ఎంతో కొంత గనదు ముట్టజెప్పి జీవవ్యర్థాలను తరలిస్తున్నట్టు సమాచారం. ఎక్కడ బయో వేస్ట్ లెక్కలు చెప్పాల్సి వస్తుందోనని కొన్ని ఆస్పత్రులు బెడ్లను సైతం తక్కువ చేసి చూపుతున్నట్లు తెలిసింది. కాగితాల్లో మగ్గుతున్న చట్టం.. ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీగా వెలువడుతున్న చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీ సైక్లింగ్ కేంద్రాలకు తరలించాలి. రవాణా సమయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, నాలాల్లో ఈ వ్యర్థాలను పడవేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులు అంటురోగాల బారిన పడుతున్నారు. మరోవైపు ఆస్పత్రి వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపే విషయంలోనూ పలు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆస్పత్రులపై ‘పీసీబీ’ నజర్ జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించని ఆస్పత్రులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమైంది. ఆలాంటి వాటిని మూసివేసేందుకు వెనుకాడబోమని పీసీబీ సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి యాజమాన్యం పీసీబీ నుంచి ‘కన్సెంట్ ఫర్ ఆపరేషన్’(సీఎఫ్ఓ)అనుమతి పొందాలని, రెండునెలల్లోగా మురుగునీటి శుద్ధి ప్లాంటు(ఎస్టీపీ)నిర్మించుకుని వినియోగంలోకి తీసుకు రావాలని ఆదేశించారు. రెండు నెలల్లోగా ఈ పనులు పూర్తిచేయని ఆస్పత్రులను ప్రాసిక్యూషన్ చేయడంతో పాటు మూసివేస్తామని హెచ్చరించారు. ఇటీవల నిబంధనలు పాటించని పది ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీచే శామని తెలిపారు. నిబంధనలకు పాతర ఇలా.. ♦ ఆస్పత్రులు విధిగా తమకు అందుబాటులో ఉన్న బెడ్లకు బయోవ్యర్థాల సెస్‌ను చెల్లించడం లేదు. బెడ్ల లెక్కలను తక్కువ చేసి చూపుతున్నాయి. ♦ ఆస్పత్రి వ్యర్థాలు సేకరించేందుకు ప్రాంతాల వారీగా ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఏజెన్సీల మధ్య అనారోగ్యకర పోటీ నెలకొంది. ♦ వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపే విషయంలో ఏజెన్సీలు సూచించిన పద్ధతిలో ఆస్పత్రులు నడుచుకోవడంలేదు. ♦ ఆస్పత్రి వ్యర్థాలను తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ♦ ఒక్కో ఏజెన్సీకి పదివేల బెడ్ల నుంచి ఆస్పత్రి వ్యర్థాలను సేకరించేందుకు అనుమతివ్వాలి. ఆస్పత్రి వ్యర్థాలతో అనర్థాలివే.. హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడ్లు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆ రోగం సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్–బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్‌ను బయటే పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు సోకుతున్నాయి. నిత్యం గ్రేటర్లో వ్యర్థాల ఉత్పత్తి ఇలా.. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు: 3,919 ♦ రోజువారీగా వెలువడుతున్న బయోమెడికల్ వేస్ట్: 50 టన్నులు ♦ నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నజీవ వ్యర్థాలు: 20 టన్నులు రంగు డబ్బాలతో సత్ఫలితం పసుపు రంగు డబ్బా: మానవ, జంతు, శరీర అవయవాలు, రక్తంతో కూడిన భాగాలు, ప్రయోగశాలల వ్యర్థాలు నిల్వ చేయాలి. ఎరుపు డబ్బా: రక్తంతో తడిసిన సామగ్రి, కాటన్, డ్రెస్సింగ్ మెటీరియల్, ప్లాస్టర్లు, సిరంజిలు, ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయాలి. నలుపు డబ్బా: కాలం చెల్లిన మందులు, సూదులు, బ్లేడ్లు, ఇతర పదునైన వస్తువులు వేయాలి. నేరేడు రంగు డబ్బా: కేన్సర్‌కు వాడే మందులు, సంబంధిత వ్యర్థాలు వేయాలి. -
బయోమెడికల్ వేస్ట్‌తో వ్యాధులు
– కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి కర్నూలు(హాస్పిటల్): ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌తో వైద్యసిబ్బందికే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ సంచాలకులు రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్ నిర్వహణపై బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో బయోవేస్ట్ నియమావళి, వ్యర్థపదార్థాలను వేరే చేసే పద్ధతి, చేతులు పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ, ద్రవ వ్యర్థాలు, వ్యాధి సంక్రమిక బట్టలను శుభ్రపరచడం, నేలను శుభ్రం చేయడం, పాదరస వ్యర్థ నిర్వహణ, వ్యర్థాలను నిల్వ ఉంచే ప్రదేశం ఎలాగుండాలనే విషయాలపై విపులీకరించారు. ఆసుపత్రుల్లో బయోమెడికల్ వేస్ట్‌ను ఎలా నిర్వహించాలనే విషయమై నియంత్రణకు తమ శాఖ చూసుకుంటుందన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే రోగాలు వస్తాయaన్నారు. సింగపూర్ దేశంలో వ్యర్థాలు రోడ్డుపై పారవేస్తే జరిమానాలు విధిస్తారన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం మున్సిపల్ వ్యర్థాలు పారవేసే వారిపై జరిమానాలు విధించే చట్టం వచ్చిందన్నారు. దీంతో ప్రజల్లో క్రమశిక్షణ గల జీవితం అలవడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ వై. శ్రీనివాసులు, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, రక్షణ సంస్థ ప్రతినిధి రత్నం, తదితరులు పాల్గొన్నారు.